శాకంబరీదేవిగా సాక్షాత్కరించిన నిమిషాంబిక

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: పవిత్ర పుణ్యక్షేత్రమైన బోడుప్పల్ లోని నిమిషాంబికా దేవి అమ్మవారి క్షేత్రంలో శనివారం అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు సాక్షాత్కరించారు. శాకంబరిగా అమ్మవారిని అలంకరించి పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలగిపొయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భక్తుల విశ్వాసం. అమ్మవారిని శనివారం వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేష అలంకరణ చేశారు. ఉపాలయాలకు కూడా కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరించారు. వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె.అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎస్ రమేష్, తెలంగాణ రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ తదితరులు  చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రధానార్చకుల చంద్రశేఖర శర్మ, ఇతర సహాయక అర్చకులతో కలిసి అమ్మవారిని అలంకరించడంతో పాటు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.