సూర్యాపేట ఎస్బిఐ శాఖలో 15 కోట్ల రూపాయల కుంభకోణం...?

సూర్యాపేట ఎస్బిఐ శాఖలో 15 కోట్ల రూపాయల కుంభకోణం...?
  • సూర్యాపేట ఎస్బిఐ కుంభకోణం పై పోలీసుల విచారణ

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎన్ హెచ్ 9(ప్రస్తుతం ఎన్హెచ్ 65 బ్రాంచ్)  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో మేనేజర్ అవకతవకలకు, భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు  వెలువడుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ మొదలుపెట్టినట్టు తెలిసింది. సూర్యాపేట ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ గా గతంలో పనిచేసిన సైదులు ఇటీవల ట్రాన్స్ఫర్ పై హైదరాబాదులోని రామంతపూర్ ఎస్బిఐ బ్రాంచ్ కు మేనేజర్ గా వెళ్ళాడు.  అక్కడ ఖాతాదారుల పేరు మీద  దాదాపు 2.80 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డట్టు ఫిర్యాదులు అందడంతో పోలీసులు విచారించి నిర్ధారించారు. ఇదే కోణంలో ఆలోచించిన పోలీసులు సైదులు అంతకుముందు పనిచేసిన సూర్యాపేట ఎస్బిఐ బ్రాంచ్ విషయం కూడా ఆరా తీయడంతో ఈ భారీ కుంభకోణం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూర్యాపేట బ్రాంచ్ లో కూడా సుమారు 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగిందని సమాచారం. ఈ దిశగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీంతో పోలీసులకు తవ్విన కొద్దీ విస్తు పోయే నిజాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం రామంతపూర్ ఎస్బిఐ శాఖ మేనేజర్ గా చేస్తున్న సైదులు సూర్యాపేట ఎస్బిఐ మేనేజర్ గా చేస్తున్న సమయంలో ఎక్కువగా ఉద్యోగస్తులకు గృహ రుణాలు, పర్సనల్ లోన్లు ఇచ్చినట్లు బినామీ కాగితాలు సృష్టించి పది నుంచి పదిహేను కోట్ల రూపాయల దాకా దండుకున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి.

ఈయనకు ఇక్కడ పనిచేసిన ఫీల్డ్ ఆఫీసర్ కూడా సహకరించినట్టు సమాచారం. అంతే కాకుండా 10 లక్షల రూపాయల పర్సనల్ లోన్ ఇస్తే 2 లక్షల రూపాయలు కమిషన్ గా తీసుకునేవాడని, 20 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ ఇస్తే నాలుగు లక్షల రూపాయలు కమిషన్ గా తీసుకునేవాడని, సిబిల్ లేనప్పటికీ కమిషన్ కు ఆశపడి లోన్లు మంజూరు చేసేవాడని,  ఈ విషయంలో ఒక ముస్లిం బ్యాంక్ ఏజెంట్ మధ్యవర్తిగా ఉన్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపద్యంలో ఎస్బిఐ మేనేజర్ సైదులు, మరొక మేనేజర్ మల్లయ్యలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో ఏపూరు బస్టాండ్ వద్ద కల ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ లో కూడా ఇలాంటి కుంభకోణమే జరిగినప్పటికీ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు వహించి ఆ విషయాన్ని బయటకు రాకుండా చేశారని ఆరోపణలు వినవస్తున్నాయి.

ఏపూరు బస్టాండు ఎస్బిఐ శాఖ లో జరిగిన రుణాల అవకతవకలపై ఫిర్యాదు చేసిన వ్యక్తినే తప్పు పట్టినట్టు సమాచారం. ఈ విధంగా ఎస్బిఐ ఎన్హెచ్9 శాఖ మేనేజర్ గా పనిచేసిన సైదులు పై అవినీతి ఆరోపణలు రావడం, ఇప్పటికే ఆయన బారిన పడ్డ కొందరు బాధితులు  పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా రామంతపూర్ టు సూర్యాపేట ఎస్బిఐ శాఖలలో జరిగిన అవినీతి తతంగం అంతా వెలికి తీయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్బిఐ మేనేజర్లు సైదులు మల్లయ్యలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరింత లోతుగా విచారణ చేపడితే ఎస్బిఐ మేనేజర్ అవినీతి లీలలు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉందని ఎస్బిఐ ఎన్హెచ్ 9, (ప్రస్తుతం ఎన్ హెచ్ 65 బ్రాంచ్) ఖాతాదారులు పేర్కొంటున్నారు. ఆ దిశగా పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారని తెలిసింది.