తెలంగాణలో  ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు

తెలంగాణలో  ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు
  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్​ రావు

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు చెప్పారు. అత్యధికంగా వైద్యులను అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఐటీ ఐటీ అని జపించేవారని, ఇప్పడు కేసీఆర్ హయాంలో    హైదరాబాద్ నగరంలో ఐటీతో పాటు గ్రామాల్లో వ్యవసాయం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని  తెలిపారు. తాజాగా ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం మూడు లక్షల ఐటీ ఉద్యోగాలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య పది లక్షలకు పెరిగిందన్నారు. ఐటీ ఉద్యోగులకు తెలంగాణ నిలయంగా మారడం గర్వకారణమన్నారు.

సోమవారం సిద్ధిపేట జిల్లా  చిన్నకోడూరు మండలం రామాంచలో కొత్తగా నిర్మించిన శ్రీరంగనాయక స్వామి బీఫార్మసీ కాలేజీని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరంఆయన  మాట్లాడుతూ.. విద్యాలయాలకు నిలయంగా సిద్ధిపేట జిల్లా మారిందన్నారు. సిద్ధిపేటలో మెడికల్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ, నర్సింగ్ సహా అన్ని రకాల విద్యలకు సంబంధించిన  విద్యాలయాలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకించి సిద్ధిపేట జిల్లా అని కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతోందని అన్నారు. వరి   ఉత్పత్తిలో నెంబర్ ఒన్ స్థానంలో తెలంగాణ ఉందని చెప్పారు. దేశంలో కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.  కేవలం హైదరాబాద్ కే పరిమితమైన ఎగ్జిబిషన్ ను ఇకనుంచి అన్ని జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఎగ్జిబిషన్ సొసైటీ మహిళా విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని ఆయన అభినందించారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరింత మంచి కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు.