చావులు ఆగవా!! 15 యేళ్లలో 23 మంది

చావులు ఆగవా!! 15 యేళ్లలో 23 మంది
  • కొడిగడుతున్న ఆశా దీపాలు
  • ట్రిపుల్ ఐటీలో సమస్యల కొలువు 
  • యేటా ఆందోళన చేసినా ఫలితం లేదు
  • స్పందించని అధికారులు, ప్రభుత్వం
  • మంత్రులు హామీలిచ్చినా మారని తీరు
  • ఉన్న సిబ్బంది అంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే
  • శాశ్వత నియామకాలకు కలగని మోక్షం
  • ఘటన జరిగినపుడే ఉన్నతాధికారుల హడావుడి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బంగారు భవిష్యత్తు మీద ఆశలతో బాసర ట్రిపుల్ ఐటీలో చేరిన కొందరు విద్యార్థుల జీవితాలు వారి ఆశలు తీరకుండానే కొడిగడుతున్నాయి. దీపిక ఘటనతో ఇప్పటివరకు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 23కు చేరింది. యేటా ఏదో ఒక సమస్యతో ఎవరో ఒకరి ప్రాణాలు పోతున్నాయి. పోటీ తట్టుకోలేక కొందరు చనిపోతే, సిబ్బంది, అధికారుల వేధింపులు, ఒత్తిడితో మరి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కని యేడాది లేదంటే అతిశయోక్తి కాదు. సిబ్బందిలో ఎక్కువగా కాంట్రాక్ట్ ఉద్యోగులే కావడంతో ఇక్కడి సమస్యలు ఎవ్వరికీ పట్టడం లేదు. మెస్ ను కూడా ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడంతో విద్యార్థులు కడుపునిండా భోజనం చేయలేని పరిస్థితి నెలకొంది. పురుగులు పట్టిన, కుళ్లిపోయిన ఆహార పదార్థాలు ఇస్తున్నారని విద్యార్థులు, మీడియా గొంతు చించుకున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. విద్యార్థులు రోడ్డెక్కిన ప్రతిసారీ అధికారులు బెదిరింపులకు దిగడం, జులుం ప్రదర్శించడంతో గత్యంతరం లేని పరిస్థితులలో వారు చదువు కొనసాగిస్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో దాదాపు పది రోజులపాటు విద్యార్థులు తరగతులు బహిష్కరించినపుడు అధికారులు సమస్యల పరిష్కారానికి బదులు బెదిరింపులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. చివరికి మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఆరు నెలలలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గడువు ముగినా హామీ అమలుకు నోచుకోలేదు. 

యేటా ఇదే పరిస్థితి

యేటా దాదాపు 1,600 మందికి పైగా విద్యార్థులు ఐఐఐటీలో వివిధ కోర్సులలో చేరుతూ, సమస్యలతో సహవాసం చేస్తూ  ఇబ్బందుల పాలవుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం, ప్రభుత్వం బాధ్యతలు విస్మరించడం మూలంగా విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు వర్ణనాతీతం. 15 యేళ్ల కాలంలో ఇప్పటివరకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు. సంస్థాపరంగా ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. అందుబాటులో ఉన్న వివరణ ప్రకారం 2014లో నల్గొండ జిల్లాకు చెందిన నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మార్చి 2017లో నల్గొండ జిల్లాకు చెందిన కూరాకుల రాధ ప్రాణాలు తీసుకుంది. 2018లో  సిద్దిపేట జిల్లాకు చెందిన అనూష బలనన్మరణం చెందింది. 2020లో సంజయ్ అనే విద్యార్థి ఐఐటీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 2022లో ఆగస్టు నెలలో రాథోడ్ సురేశ్, డిసెంబర్ లో  భానుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా మంగళవారం దీపిక ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే.

మీడియా కంట పడకుండా

ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారీ అధికారులు దీన్ని మీడియాకు కనిపించకుండా చేసే ప్రయత్నాలు చూస్తే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఆత్మహత్య చేసుకున్న దీపికను కూడా ఎవరికీ తెలియకుండా చికిత్స నిమిత్తం భైంసాకు తరలించారు. అక్కడి వైద్యులు దీపిక మరణించినట్లు ధృవీకరించడంతో నిర్మల్ కు తరలించడం ఒక ప్రహసనంగా మారింది. చివరికి శవాన్ని చూసేందుకు సైతం మృతురాలి తండ్రి వీరన్నను అటు అధికారులు, ఇటు పోలీసు యంత్రాంగం అనుమతించకపోవడం విమర్శలకు తావిస్తోంది. చివరికి హఠాత్తుగా అనారోగ్యం బారిన పడిన మృతురాలి తండ్రికి వైద్యం అందించాల్సిన డ్యూటీ డాక్టర్లు కూడా అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇంత దయనీయంగా ఉన్న ఐఐఐటీ నిర్వహణపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిస్థాయి సిబ్బంది నియామకం, సౌకర్యాల కల్పన వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

దీపిక మృతదేహం తల్లిదండ్రులకు అప్పగింత

బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యకు పాల్పడిన దీపిక మృతదేహానికి బుధవారం నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీ ఎస్పీ జీవన్ రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మృతదేహాన్ని మృతురాలి తల్లిదండ్రులకు అందజేశారు.