బాలయ్య ముద్దుల మామయ్య  @ 34

బాలయ్య ముద్దుల మామయ్య  @ 34

(ముద్దుల మామయ్య రిలీజ్ 7 ఏప్రిల్ 1989)

బాలకృష్ణతో భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ తీసిన చిత్రాల్లో ముద్దుల మామయ్య ఒకటి. బాలయ్య– భార్గవ్  ఆర్ట్స్ కాంబినేషన్ కు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. సినిమాలు హిట్టయ్యాయి. ఈ బ్యానర్ పై వచ్చిన సినిమాల్లో ప్రధానంగా సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ ఉన్నాయి. భార్గవ్ సక్సెస్ కు ఈ పాయింట్ కారణం కావచ్చు. ముద్దుల మామయ్య కూడా సెంటిమెంట్ ఉన్న సినిమానే. చెల్లెలి సెంటిమెంట్ తో తీసిన మూవీ ఇది. 

ఓ దుర్మార్గుడు చేసిన మోసంవల్ల తల్లిదండ్రులు చనిపోతే పసిపాపగా ఉన్న చెల్లెలు సీతకు అన్నీ తానే అయి పెంచాడు బాలకృష్ణ. చెల్లెలు ప్రేమించినతనికే ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లయ్యాక అతను చేసిన మోసం బయటపడింది. అతను ఆమెను కత్తితో పొడిచి ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. సీత చనిపోతుంది. చెల్లెలి జీవితం నాశనం కావడానికి కారణమైన ఆ తండ్రీ కొడుకులపై పగ తీర్చుకుని జైలుకెడతాడు బాలకృష్ణ. జైలు నుంచి తిరిగొచ్చాక చెల్లెలి కొడుకులో చెల్లిని చూసుకుంటూ గడుపుతాడు. ఈ సినిమా కేవలం బరువైన సంఘటనలున్న ట్రాజెడీ పిక్చర్ అని అనుకోకూడదు. సరదా సీన్స్ కూడా ఉన్నాయి. 

మగాళ్లంటే మండిపడే విజయశాంతి పెళ్లి చేసుకోనని శపథం చేయడం, బాలకృష్ణను కొట్టడం, అందుకు బదులుగా ఆ తర్వాత ముద్దుపెట్టుకొని సారీ చెప్పడం వంటి చిలిపి సన్నివేశాలూ ఉన్నాయి. అలాగే ఈ మూవీలో విజయశాంతి వేసిన దేవదాసు నాటకంలో బాలయ్య నిజంగా మందుకొట్టివచ్చి  కామెడీగా నటించడం కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. చెల్లెలు సీత అంటే ప్రాణంపెట్టే బాలకృష్ణ … వానొచ్చినప్పుడు ఆమె ఎక్కడ తడిసిపోతుందో అని తను తడుస్తూ గొడుగుపడతాడు. సీత చనిపోయినప్పుడు కాటికి తీసుకెడుతుంటే బాలకృష్ణ గొడుగుపట్టి … అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని, అడుగేస్తే పాదాలు కందవా నా కన్నుల్లో కన్నీళ్లు చిందవా’ అంటూ పాడిన పాట ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. 

తన చెల్లెలి ఆనందంకోసం విజయశాంతి ఆమె భర్త రాసినట్టు తనే లెటర్స్ రాస్తుందని తెలిసి మొదట కోప్పడి తర్వాత బాధపడే సన్నివేశమూ స్పందింపచేసింది. అలాగే విలన్ తో బాలకృష్ణ చేసిన ఫైటింగ్ లో కొన్ని కామెడీ షాట్స్ కూడా ఉన్నాయి. ఇక డైలాగ్స్ విషయానికి వస్తే – దేవదాసు నాటకంలో బాలకృష్ణతో విజయశాంతి ‘మనశ్శాంతి కోసం వచ్చారా స్వామీ’ అని అడిగితే బాలకృష్ణ తడుముకోకుండా వెంటనే ‘మందుకోసం వచ్చానమ్మా’ అన్న డైలాగ్ పేలింది. బాలకృష్ణ కాళికాదేవి గుడిలో ‘అమ్మా… నా చెల్లి పెళ్లయింది. నా చెల్లికోసమే దొంగనయ్యాను. ఇప్పుడు దొంగ మనిషవుతున్నాడు’ అనే డైలాగ్ కూడా మనసును తాకింది. 

పాటల్లో బాలకృష్ణ, విజయశాంతి పాడిన ‘చెంగు చెంగు ముద్దాడంగ, మోహనరంగ, చెంగున దూకే వయ్యారంగ, తొలి పొంగుల రంగ’ పాట, ‘మామయ్య అన్న పిలుపూ మా ఇంట ముద్దులకూ పొద్దుపొడుపూ ’ పాట హిట్టయ్యాయి. కోడి రామకృష్ణ డైరెక్ఝన్ లో నిర్మాత ఎస్. గోపాలరెడ్డి తీసిన ముద్దుల మామయ్య 1989 ఏప్రిల్ 7న విడుదలైంది. అంటే 2023 నాటికి 34 ఏళ్లు. బాలకృష్ణ, విజయశాంతి, సీత ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, గొల్లపూడి మారుతీరావు, ఆహుతి ప్రసాద్, ఈశ్వరరావు, బాలాజీ, బ్రహ్మాజీ ఇతర పాత్రలు వేశారు.

 అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా, ఎక్కువ వసూళ్లు చేసిన మూవీగా ‘ముద్దుల మామయ్య’ పేరుతెచ్చుకుంది. ఈ సినిమాతోనే బాలయ్యకు టాప్ హీరోగా పేరు రావడమే కాక, యువరత్నఅనే బిరుదు కూడా వచ్చింది. ఇది మొదట తమిళంలో ‘ఎన్ తన్గచి పడిచావాకి’ పేరుతో విడుదలైంది. దాన్నే తెలుగులో రీమేక్ చేశారు. హిందీలో ఆజ్ కా అర్జున్, కన్నడంలో రవిమామ, బెంగాలీలో పబిత్రపాపి పేరుతో మళ్లీ తీశారు. వాసు కథ అందించిన ఈ చిత్రానికి మాటలు గణేష్ పాత్రో, పాటలు డాక్టర్ సి. నారాయణరెడ్డి, వెన్నెలకంటి, సంగీతం కె.వి. మహదేవన్, ఫోటోగ్రఫీ కె.ఎస్. హరి సమకూర్చారు. సాధారణంగా తెలుగు సినిమాల్లో సిస్టర్ సెంటిమెంట్ వర్కవుటవుతుంది. ముద్దుల మామయ్యలో కూడా అది రుజువైంది. సినిమా హిట్టయ్యింది. బాలయ్య – విజయశాంతి మధ్య సరదా సీన్స్, సీతతో బరువైన సన్నివేశాలు కూడా సినిమా సక్సెస్ కు ప్లస్ అయ్యాయి.

         --వి. మధుసూదనరావు.