మరో 4 లక్షల ఉద్యోగాలు

మరో 4 లక్షల ఉద్యోగాలు
  • 2028 నాటికి లైఫ్​సైన్సెస్​ఈకో సిస్టంను రెట్టింపు చేస్తాం
  • 24 నుంచి 26 వరకు బయో ఆసియా సదస్సు 
  • మీడియా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ చిట్ చాట్

ముద్ర తెలంగాణ బ్యూరో: 
తెలంగాణలో ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల విలువ కలిగిన లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం విలువను  2028 నాటికి రెట్టింపు చేస్తామని ఐటీ, మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇపుడు నాలుగు లక్షలున్న ఉద్యోగాల సంఖ్యను ఎనిమిది లక్షలకు పెంచుతామన్నారు. హైదరాబాద్​నగరంలో 24 నుంచి 26 వరకు ‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌: షషేపిగ్ నెక్ట్స్ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’ అన్న అంశాలపై జరగనున్న 20వ బయో ఆసియా సదస్సు  జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. బయో ఆసియా ప్రాముఖ్యంతోపాటు జీవశాస్త్ర, ఫార్మా రంగాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యల గురించి వివరించారు. 19 సదస్సులను పూర్తి చేసుకుని ఈసారి ప్రతిష్టాత్మక 20వ సదస్సును నిర్వహించుకోబోతున్నామన్నారు. బయో ఆసియా 19 యేండ్లలో  మూడు బిలియన్ డాలర్ల (సుమారుగా రూ. 24 వేల కోట్లు) పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడులలో కొన్ని ఆంధ్రప్రదేశ్‌కూ వెళ్లాయన్నారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ రంగానికి బయో ఏసియా విస్తృత సేవలను అందించిందని గుర్తు చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ సదస్సు విజయం సాధిస్తుందన్నారు. వందకుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్‌ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగామని, 20 వేలకు పైగా భాగస్వామ్య చర్చలు, 30 పాలసీ పేపర్లు, సిఫార్సులకు ఈ సదస్సు వేదిక అయ్యిందన్నారు.

గడిచిన 20 యేండ్లలో 250 కి పైగా అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడంలో ఈ సదస్సు భాగస్వామిగా ఉందని కేటీఆర్ అన్నారు. కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఉండబోతోందన్నారు. ఫార్మాసిటీ విషయంలో కోర్టులలో ఉన్న కేసులపై విచారణ ముగిసిందని, తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్‌ ప్రపంచంలోనే అతి కీలక కేంద్రంగా మారిందని, యేటా 900 కోట్ల టీకాలు తయారు చేస్తోందని చెప్పారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కేంద్రం కూడా త్వరలో హైదరాబాద్‌కు రానుందన్నారు. హైదరాబాద్ ఫార్మసిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని మంత్రి దుయ్యబట్టారు. ఫార్మ సిటీకి సహాయం చేయకున్నా, ఐటీఐఆర్ రద్దు చేసినా ఆయా రంగాలలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందదని కేటీఆర్​ తెలిపారు.


‘అమృత్‌ కాల్‌’ కంటే ‘మిత్ర్ కాల్‌’ బాగుంటుంది
కేంద్ర ప్రభుత్వం మీదా, బీజేపీ కీలక నేతల మీదా మంత్రి కేటీఆర్ ఒంటికాలిపై లేచారు. సోషల్​ మీడియా ద్వారా దుయ్యబడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర మం త్రుల మీదా, నేతల మీదా ట్విట్టర్​వేదికగా సైటైర్లు వేస్తున్నారు. సోమవారం కర్నాటకలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రస్థాయిలో స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తమ పాలనా కాలాన్ని 'అమృత్‌ కాల్‌ (మంచి కాలం)’ అనడం కంటే, ‘మిత్ర్ కాల్‌ (మిత్రుల కాలం)’ అనే పదం బాగా సూటవుతుందని పోస్టు చేశారు. ‘ఎ మోర్‌ యాప్ట్‌ నేమ్‌ ఫర్‌ అమృత్‌ కాల్‌ ఈజ్‌ ఎ మిత్ర్ కాల్‌, వాట్‌ డూ యూ సే గైస్‌?’ అని ట్వీట్‌ చేశారు. మంత్రి ట్వీట్‌కు నెటిజన్‌ల నుంచి మంచి స్పందన కనిపిస్తున్నది. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో మంచి రోజులు రాకపోగా, దేశం అన్ని అంతర్జాతీయ సూచీలలో వెనుకబడి పోయిందని పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి రిప్లై ఇచ్చారు. అదానీకే అమృత కాలమని జగన్‌రెడ్డి పేర్కొన్నారు.  మృత్‌ కాల్(చచ్చే కాలం)‌’ అని ఎందుకు అనగూడదని మన్నార్ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ‘మీరు చెప్పింది కరెక్ట్‌ రామన్నా’ అని మరి కొందరు, ‘పర్‌ఫెక్ట్‌ సార్‌’ అని ఇంకొందరు ఇలా రకరకాలుగా స్పందించారు.  జేపీ నడ్డా, నరేంద్ర మోడీ మీద కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోడీ ఆపారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్ర మధ్య నెలకొన్న బెలగావి సరిహద్దు సమస్యను ఇంతవరకు ప్రధాని పరిష్కరించలేకపోయారని, రష్యా–ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ఆపారని నడ్డా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ‘ఔర్‌ కిత్నా ఫేకోంగే సర్’ ( ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతారు సార్‌ ) అంటూ సెటైర్‌ వేశారు.