కామారెడ్డి అభివృద్ధికి రూ.45 కోట్లు 

కామారెడ్డి అభివృద్ధికి రూ.45 కోట్లు 
  • మంజూరు చేసిన మినిస్టర్​కేటీఆర్ 
  • జిల్లా కేంద్రంలో ఆరు లేన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ ప్రారంభం

కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ఆయన రోడ్లు, భవనాల శాఖ మినిస్టర్​వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల రహదారి, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్అండ్ బీ చౌరస్తా వద్ద మాట్లాడారు. 

  • అన్నిరంగాల్లో కామారెడ్డి అభివృద్ధి..

సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో  అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. దాదాపు 28 కోట్లతో సెంట్రల్ లైటింగ్, ఆరు వరుసల రోడ్డు, స్వాగత్ తోరణం, సెంట్రల్ మీడియన్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని అన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు చేయాలని గోవర్ధన్.. కేసీఆర్ ను కోరగా, 25 కోట్లు మంజూరు చేస్తూ అదే రోజు ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. పట్టణంలో మున్సిపల్ డిపార్ట్​మెంట్ రోడ్లు, స్టేడియం కోసం, అంతర్గత రహదారుల కోసం రూ.20 కోట్లు మంజూరు చేయాలని కోరగా తాను మంజూరు చేసినట్లు కేటీఆర్​తెలిపారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11 .15 గంటలకు  కామారెడ్డి కి చేరుకొని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ కు వెళ్లారు. అక్కడ 20 నిమిషాలు విరామం తీసుకొని అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, బీఆర్ఎస్​లీడర్లు మంత్రికి ఘనంగా స్వగతం పలికారు. అనంతరం మంత్రి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి టూరిజం బస్సులో వెళ్లారు.

  • బీజేపీ వంద అబద్ధాలు’ బుక్ లెట్, సీడీ ఆవిష్కరణ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రూపొందించిన ‘బీజేపీ వంద అబద్ధాలు’ బుక్ లెట్, సీడీనీ మినిస్టర్​కేటీఆర్ సోమవారం ప్రగతిభవన్ లో ఆవిష్కరించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు మన్నె క్రిషాంక్, వై.సతీశ్​రెడ్డి, జగన్ మోహస్ రావు, దినేశ్ చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్​‘బీజేపీ వంద అబద్ధాలు’ క్యాంపెయిన్ ను అభినందించారు. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచారన్నారు. బుక్ లెట్, సీడీ ద్వారా బీజేపీ తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా చేయాలని వారికి సూచించారు.