ధరణిలో 45 రకాల సమస్యల ను సవరించాలి: సీపీఐ రాష్ట్ర నేత కలవేన శంకర్

ధరణిలో 45 రకాల సమస్యల ను సవరించాలి: సీపీఐ రాష్ట్ర నేత కలవేన శంకర్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిలో నెలకొన్న 45 రకాల తప్పిదాలను సవరించి భూమి యజమానులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాలలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడారు. కొత్తగూడెం ప్రజా గర్జనలో అనేక అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా ధరణి వల్ల అనేకమంది భూమి యజమానులు పడుతున్న అవస్థలను ప్రస్తావించడం జరిగిందని ఆయన వివరించారు. ధరణి వల్ల భూములను కోల్పోయిన యజమానులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని కోరారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నా ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు.  ప్రకృతి వైపరీతల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.  

కౌలు రైతుల సమస్యలు కూడా పరిష్కరించి వారికి కూడా న్యాయం చేయాలని ఆయన సూచించారు. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు సత్వరమే ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.  రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం సందర్భంగా చేసిన అన్ని రకాల హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన నోక్కీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, రైతులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని అన్నారు. కార్మిక చట్టాలు, నూతన వ్యవసాయ చట్టాలను దేశవ్యాప్తంగా ప్రజలు తిప్పి కొట్టారని ఆయన తెలిపారు. ఈసమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏఐ టీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు తదితరులు పాల్గొన్నారు.