నకిలీ బంగారంతో 56 లక్షల లోను తీసుకున్న వైనం

నకిలీ బంగారంతో 56 లక్షల లోను తీసుకున్న వైనం
  • నకిలీ బంగారం కేసు విచారణ ఏమైంది...? 

ముద్ర గరిడేపల్లి:- గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం బరోడా బ్యాంకు నందు నేరేడుచర్ల మండలంలోని వైకుంటపురం గ్రామానికి చెందిన కేశవారపు రాజేష్ మే నెల 2023 వ సంవత్సరంలో తన పేరు, తన బంధువు పేరు మీద దాదాపు కేజీన్నర నకిలీ బంగారం కుదువపెట్టి 56 లక్షలు రుణం పొందాడు. లోను తీసుకొని సంవత్సరం దాటింది. ఈ నేపథ్యంలో ఇటీవల బ్యాంకు ఉన్నత అధికారులు బ్యాంకులో ఆడిట్ జరిపారు. రాజేష్ కుదువ పెట్టిన బంగారం నకిలీ అని తేల్చారు.

దీంతో బ్యాంకు అధికారులు రాజేష్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బ్యాంకు సిబ్బంది బంగారం తనిఖీ చేయకుండా లోను ఎలా ఇచ్చారనే కోణంలో బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బంగారం తనిఖీ చేసే గోల్డ్ అప్రైజర్ పాత్ర కూడా ఉండొచ్చని విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ బంగారం తాకట్టు విషయంలో మరిన్ని ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం బయటికి వస్తుండగా అసలు నిజాలు, మోసం ఎలా జరిగింది అనే విషయం పోలీసుల విచారణలో తేలనుంది.

ఇప్పటికే ఈ విషయంలో విచారణ చేపట్టిన గరిడేపల్లి పోలీసులకు కళ్ళు మిరమిట్లు గొలిపే ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడి కావడంతోపాటు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాజేష్ పలుమార్లుగా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టడమే కాకుండా అదే బంగారం పై హాల్ మార్క్, బి ఎస్ ఐ ముద్ర కూడా వేయించడం బ్యాంకు అధికారులను సైతం ఆశ్చర్యానికి లోను చేసింది. అంతేకాకుండా నకిలీ బంగారంతో మోసం చేయాలని ఉద్దేశంతోనే నిందితుడు రాజేష్ బంగారం షాపులో మిర్యాలగూడ ప్రాంతంలో కొంతకాలం పని చేశారని ఆయన బంధువులు వివరించారు.

మిర్యాలగూడ బంగారం షాపులో పనిచేసి  కొన్నాళ్లకు తానే సొంతంగా బంగారం షాపు నిర్వహించారు. ఈ క్రమంలోనే నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా ఎలా నమ్మించాలనే విషయంలో ఆయన పలు రకాలుగా ప్రయత్నించి నకిలీ బంగారానికి మూడు పొరల మీద హాల్ మార్క్ బంగారం ముద్రలు వేయించి ఇత్తడికి మూడు పొరలలో బంగారం పోత పోయించినట్టు తెలిసింది. మూడు పొరలుగా బంగారం పూత ఉండడంతో అసలు బంగారంగా బ్యాంక్ అధికారులను నమ్మించినట్టు సమాచారం. ఈ విషయంలో బంగారాన్ని తనిఖీ చేయాల్సిన గోల్డ్ అప్రైజర్ సైతం కనిపెట్టలేకపోవడం విశేషం గా పేర్కొంటున్నారు. అయితే వాస్తవానికి గోల్డ్ అప్రైజర్ నకిలీదా, ఒరిజినల్ బంగారమా అని కనిపెట్టే విషయంలో కొంత  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నిందితుడు రాజేష్ తో కలిసి గోల్డ్ అప్రైజర్, మరికొంతమంది బ్యాంకు సిబ్బందికి కూడా ఈ విషయంలో హస్త ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేసు నమోదు చేసిన గరిడేపల్లి పోలీసులు ఎన్నికల బిజీ గా ఉండడంతో కొంత కేసు విచారణ నెమ్మదించినప్పటికీ త్వరలోనే అసలు విషయాన్ని చేదించనున్నట్టు సంబంధిత పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా నకిలీ బంగారాన్ని కుదవబెట్టిన రాజేష్ తను ఒక్కడే కాకుండా తనకు తెలిసిన బంధువులు, స్నేహితుల పేరు మీద మొత్తం ఏడుగురు ద్వారా కేజిన్నర బంగారం నకిలీ బంగారాన్ని కుదువబెట్టి మొత్తం 56 లక్షల 85 వేల రూపాయలను రుణంగా పొందినట్టు బ్యాంక్ అధికారులు వెల్లడించారు. బంధువులు, స్నేహితుల పేరు మీద లోను నిర్ధారణ కాగానే సదర్ ఎమౌంటును తన ఖాతాలోకి మళ్లించుకున్నట్టు తెలిసింది.

దీనికి ప్రధాన కారణంగా బంగారం షాపు సొంతంగా నిర్వహించే క్రమంలో నష్టాలకు గురైన రాజేష్ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఒక దురాశతో ఈ ప్రయత్నాలకు పన్నాగం పట్టినట్టు గ్రామస్తులు వివరిస్తున్నారు. అంతేకాకుండా వైకుంటపురం గ్రామంలో బంగారం వస్తువులు చేపిస్తానని డబ్బులు తీసుకున్న రాజేష్ సదరు గ్రామస్తులకు సకాలంలో తాను అనుకున్న ప్రకారం బంగారు వస్తువులు చేయించలేకపోవడంతో వారు అతనిపై ఒత్తిడి తీసుకురాక ఇటీవల తనకు గ్రామాల్లో ఉన్న 30 గుంటల భూమిని డబ్బులు ఇచ్చిన వారికి పెద్ద మనుషుల సమక్షంలో రాసి ఇచ్చారని తెలిసింది. మొత్తానికి మొత్తంగా నిందితుడు రాజేష్ తనకున్న ఆర్థిక నష్టాలు, కష్టాల నుండి బయటపడటానికి బ్యాంకును మోస మోసగించి ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు, ఆర్థిక మోసాలకు పాల్పడ్డట్టు సమాచారం. పోలీసులు ఈ విషయంలో విచారణను మరింత లోతుగా నిష్పక్షపాతంగా, వేగవంతంగా జరిపి నిగ్గు   తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.