ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఆర్ పై క్రిమినల్ కేసు పెట్టాలి: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఆర్ పై క్రిమినల్ కేసు పెట్టాలి: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి అయినా తన తనయుడు గడ్డం వంశీకృష్ణ తో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివేక్ మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ అనేది పెద్ద క్రిమినల్ కేసు అని, ఫోన్ టాపింగ్ చేయవద్దని పార్లమెంట్లో చట్టం చేశారన్నారు. నిబంధనలు విరుద్ధంగా ఫోన్ టాపింగ్ చేసిన కేసీఆర్ పై కేంద్రం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ 38 వేల కోట్లతో నిర్మించాల్సిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రాజెక్టును కెసిఆర్ స్వార్థ ప్రయోజనాల కోసం పేరు మార్చి లక్ష ఇరవై వేల కోట్ల అంచనాలకు పెంచి రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి నెట్టారని అన్నారు. మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారని పదేళ్లలో10 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.

ఉద్యోగాల కల్పన దేవుడేరుగాని పరిశ్రమలు మూతపడి ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయని అన్నారు. నల్లధనాన్ని తీసుకువస్తానన్న మోదీ.. ఏ ఒక్క పేద వారి అకౌంట్లో కూడా డబ్బులు వేయలేదని... అదే అదాని, అంబానీ డబ్బు వందల రెట్లు రెట్టింపు అయింది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజి మున్సిపల్ అధ్యక్షులు గిరి నాగాభూషణం, విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, బండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.