మంచిర్యాల అభ్యర్థిని మార్చాలి

మంచిర్యాల అభ్యర్థిని మార్చాలి

మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ధిక్కార స్వరం
బీసీలకు టికెట్ ఇవ్వాలి
కేటీఆర్, హరీష్ రావును కలవాలని నిర్ణయం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెళ్లి దివాకర్ రావును మార్చాలని బీఆరెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి అధిష్టానం ను డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నివాస గృహంలో తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్య నేతలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనంకు మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్, నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ పద్మ, మాజీ కౌన్సిలర్ లు,  నియోజకవర్గంలోని ఉద్యమకాలంనాటి నాయకులు ముట్టినేని రవి, జగన్, రమేష్ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా అరవింద్ రెడ్డి మాట్లాడుతూ, దివాకర్ రావు పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు. కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వడం సబబుకాదని సూచించారు. దివాకర్ రావుకు  మంచిర్యాల నియోజకవర్గం పై ప్రణాళిక లేకపోవడం వల్ల వెనుకబాటు ను ఎదుర్కొంటుందని విమర్శించారు. గోదావరి నీళ్లు హైదరాబాద్ కు తరలిపోయి అక్కడి ప్రజలు స్వచ్ఛమైన నీరు సేవిస్తుండగా ఇక్కడి ప్రజలకు మురుకినీరు దిక్కు అయ్యిందని అన్నారు. పట్టణంలో నిర్మించవలసిన మాతా, శిశు ఆస్పత్రిని గోదావరి ఒడ్డున నిర్మించడంతో మునిగిపోతుందని ఆరోపించారు. స్మశాన వాటిక , చెత్త డంప్ యార్డు కూడా లేదని అన్నారు. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న సర్కిల్స్ ప్లాన్ లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. మంచిర్యాల కు ఎన్నడూ లేని విధంగా గోదావరి బ్యాక్ వాటర్ వచ్చి అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. 

బీసీకి టికెట్ ఇవ్వాలి
మంచిర్యాల నియోజకవర్గం బీఆరెస్ టికెట్ బీసీకి ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. దివాకర్ రావును మార్చుతూ బీసీకి ఇవ్వాలని కేటీఆర్, హరీష్ రావు లను కలవాలని నిర్ణయించారు. ఒకవేళ అభ్యర్థిని మార్చకపోతే బీసీ అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపాలని సంకల్పించారు. బీసీ అభ్యర్థికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేస్తానని అరవింద్ రెడ్డి ప్రకటించారు. 

మూడవసారి ధిక్కార స్వరం
మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కేసీఆర్ పై ధిక్కార స్వరం వినిపించడం  మూడవసారి. 2009లో టీఆరెస్ తరపున గెలిచిన అరవింద్ రెడ్డి ఆతర్వాత కేసీఆర్ కు ఆయనకు విభేదాలు వచ్చాయి. ధీంతో వ్యతిరేకంగా గళం విప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అరవింద్ రెడ్డి వ్యతిరేకత టీఆరెస్ ను కుదిపేసింది. సవాళ్లు, ప్రతిసవాళ్ళ తో వీధికి ఎక్కడంతో వారిద్దరి మధ్య బంధం తెగిందని అందరూ భావించారు. అయితే 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ అరవింద్ రెడ్డి కి టికెట్ ఇచ్చారు. అప్పటి ఎన్నికల్లో అరవింద్ రెడ్డి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అరవింద్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు కూడా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీఆరెస్ లో చేరిన దివాకర్ రావు అరవింద్ రెడ్డి పై విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల ముందు అరవింద్ టీఆర్ ఎస్ లో చేరి దివాకర్ రావుకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఏకంగా దివాకర్ రావును లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన అభ్యర్థిత్వం మార్చాలంటున్నారు. ఇదిలావుండగా ఈ సమ్మేళనంకు దివాకర్ రావు వర్గీయులు ఎవరు హాజరుకాకపోవడం విశేషం.