కోడిన్ ఫాస్పేట మత్తు కోసం వెంపర్లాడుతున్న యువత

కోడిన్ ఫాస్పేట మత్తు కోసం వెంపర్లాడుతున్న యువత
  • మఠంపల్లి కేంద్రంగా దగ్గు మందు సీసాల భారీ దందా

ముద్ర ప్రతినిధి ,కోదాడ:- కోదాడ పరిసర ప్రాంతాలలో గంజాయితో పాటు మత్తు కలిగించే నిషేధిత దగ్గుమందు , నిద్ర మాత్రలను పల్లీ , బఠాణీలలా అమ్ముతున్నారన్న గుసగుసలు కొన్నాళ్ళనుండి వినిపిస్తున్నాయి . బుధవారం రాత్రి మఠంపల్లి మండల కేంద్రంలో గల ఒక మెడికల్ షాపు యజమాని కోడిన్ ఫేస్పెట్ కాంబినేషన్ తో ఉన్న ప్రముఖ కంపెనీకి చెందిన దగ్గు మందు సీసాలను అమ్ముతున్నారన్న సమాచారం మేరకు కోదాడ ప్రొహిబిషన్ & ఎక్సయిజ్ పోలీసులకు సమాచారం రావడంతో వారు ఉమ్మడి నల్లగొండ జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కు , సుర్యాపేట డ్రగ్ ఇన్సపెక్టర్ కు సమాచారం ఇవ్వడంతో వారు గురువారం సంబంధిత మందుల దుకాణంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు . దాడులలో  అధికారులకు విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూసినట్లు విశ్వసనీయ సమాచారం .

మఠంపల్లి మండల కేంద్రంలో ఉన్న ఆ మెడికల్ షాపు యజమాని గత కొన్నాళ్లుగా కోడిన్ ఫాస్పెట్ దగ్గు మందుతో పాటు , మత్తు కోసం వాడే నైట్రాజపం మాత్రలు కూడా భారీ స్థాయిలో అమ్మకం జరిపినట్లు కనుగొన్నారు . మత్తు కోసం వెంపర్లాడే యువతకు అదే అదునుగా భావించి ఒక్కొక్క కోడిన్ ఫాస్పెట్ కాంబినేషన్ దగ్గు మందు సీసా ను 300 నుండి 500 వరకు అముతున్నట్లు తెలిసింది . అయితే ఆ మెడికల్ షాపు యజమాని ఈ దగ్గు మందు సీసాలు , మత్తు కోసం వాడే నైట్రాజపం మాత్రలను కోదాడలోని మూడు మెడికల్ ఏజన్సీల నుండి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు . ఆ మూడు ఏజన్సీల నుండే ఇతర ప్రాంతాలకు కూడా భారీ స్థాయిలో సరఫరా అయినట్లు సమాచారం . అసలు ఎవరెవరికి సరఫరా అయ్యాయి , ఎంత మొత్తంలో సరఫరా చేశారు అన్న కోణంలో అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు . ఇప్పటికే కోదాడ లో ఔషధ నియంత్రణా అధికారులు ఇటీవలి కాలంలో పలు దఫాలు మందుల దుకాణాలపై దాడులు చేసినా కానీ ఏ మాత్రం భయపడకుండా సంపాదనే లక్ష్యంగా ఏదైనా చేసేందుకు కొందరు మందుల దుకాణ యజమానులు ప్రవర్తిస్తుండటం ఆశ్చర్యం . ఇప్పటికైనా అధికారులు సంబంధిత దుకాణదారులపై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు .