విద్యుత్ తీగలకు తగిలి వ్యక్తి మృతి

విద్యుత్ తీగలకు తగిలి వ్యక్తి మృతి

ముద్ర.వీపనగండ్ల :- అడవి పందుల భారీ నుంచి పంటను రక్షించుకోవటానికి ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలకు తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన వీపనగండ్ల మండలంలోని సంగినేనిపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై కే రాణి కథన ప్రకారం మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామానికి చెందిన గొల్ల పరమేష్ అనే రైతు మొక్కజొన్న పంటను అడవి పందుల బారి నుండి కాపాడుకోవడానికి అక్రమంగా పొలం చుట్టూ ఇనుప తీగను ఏర్పాటు చేసి వాటికి విద్యుత్ తీగతో షార్ట్ సర్క్యూట్ వచ్చేటట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వల్లభాపురం తండా కు చెందిన కాట్రావత్ నారాయణ(58) తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో సొంత పని నిమిత్తం పొలాల వెంట నడుచుకుంటూ సంగినేనిపల్లి గ్రామానికి వస్తుండగా గొల్ల పరమేష్ మొక్కజొన్న పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి షార్ట్ సర్క్యూట్తో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని వనపర్తి సీఐ నాగభూషణం పరిశీలించారు. పంట పొలానికి అక్రమంగా విద్యుత్తు తీగల ఏర్పాటు చేసి కాట్రావత్ నారాయణ మృతికి కారకుడైన గొల్ల పరమేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే రాణి తెలిపారు. మృతునికి భార్య మంగ్లీ, ఇద్దరు కుమారులు కూతురు ఉన్నారు.

పంట పొలాలకు రక్షణగా విద్యుత్తుగా ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు

రైతులు అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకోవడానికి ఇనుప తీగల ఏర్పాటు చేసి విద్యుత్ షాక్ తగిలేలా  చేస్తే చర్యలు తప్పవని వనపర్తి సీఐ నాగభూషణం హెచ్చరించారు. షార్ట్ సర్క్యూట్తో రక్షణగా తీగలు ఏర్పాటు చేయడం వల్ల వ్యక్తులు చనిపోయే ప్రమాదం ఉందని, అంతేకాక అడవి జంతువులను కూడా చంపటం నేరమని అన్నారు.