పేదలకు వరం.. అభయ హస్తం.

పేదలకు వరం.. అభయ హస్తం.
  • ప్రజా పాలన ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
  • జిల్లాలో 58 టీమ్స్ ..3425 కేంద్రాల ఏర్పాటు.
  • అన్ని మౌలిక వసతులతో పాటు కేంద్రాలలో హెల్ప్ డెస్క్ లు.
  • జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు.    గురువారం స్థానిక 17 వార్డు చింతల చెరువు యస్.సి. కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్  పి. అన్నపూర్ణ, ఏ.ఎస్.పి నాగేశ్వర్ రావు తో కలసి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్  పాల్గొని ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు . ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా పాలన కార్యక్రమాల్లో  మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ లక్ష్మీ, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలపై ప్రజల నుండి  ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు  స్వీకరించనున్నట్లు తెలిపారు.  పేదలకు అభయ హస్తం పథకాలు ఒక వరంలా మారాయని అన్నారు.  ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలు కుటుంభం వివరాలు ఒకే దరఖాస్తులో   నమోదు చేసి  అందచేయాలని,  అదేవిదంగా అనివార్య కారణాల వలన   అందచేయకపోతే మున్సిపల్, గ్రామ పంచాయతీ లలో అందచేసి తప్పక  రసీదులు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.  

మహాలక్ష్మి పథకం ద్వారా  అర్హులైన మహిళలకు ప్రతి నెల  రూ.2500 ఆర్థిక సహాయం అలాగే గ్యాస్ రూ.500 లకు అందిస్తామని  అలాగే రైతు భరోసా పథకం ద్వారా రైతులు, కౌలు రైతులకు  ఏటా ఎకరానికి  రూ. 15 వేలు అందుతాయని అన్నారు. అదేవిదంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందుతుందని తెలంగాణ ఉద్యమంలో అమరులు, ఉద్యమ కారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అందిస్తామని అన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి నెల కుటుంబానికి  200 యూనిట్ల ఉచిత విద్యుత్  అందుతుందని పేర్కొన్నారు. అలాగే చేయూత పథకం కింద అర్హులైన పది రకాల పింఛన్ దారులకు 4 వేల చొప్పున పింఛన్ అందుతుందని అలాగే  వికలాంగులకు 6 వేల పింఛన్ అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అన్ని జి.పి.లలో అలాగే మున్సిపల్ వార్డులలో తేదీ 28.12.2023 నుండి 6.1.2024 వరకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమాల్లో  ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ప్రజాపాలన ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లాలో జిపిలు, మున్సిపాలిటీ కలుపుకొని 58 టీమ్స్ ఏర్పాటు చేసి 3425 కేంద్రాలను చేపట్టామని  ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు. ముందుగా ప్రజా పాలన లో  సి.ఎం. ప్రతిజ్ఞ సందేశం పత్రం ను గ్రామ సభా సమక్షంలో చదివి వినిపించారు.

మున్సిపల్ చైర్ పర్సన్ పి. అన్నపూర్ణ , వార్డు కౌన్సిలర్ భారత్ మహాజన్  మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో స్పెషల్ అధికారి జెడ్.పి సి.ఈ. ఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ రామనుజుల రెడ్డి, పి.డి. మెప్మా రమేష్ నాయక్, డి.యస్.పి. రవి, మెడికల్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.