అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్

అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్
  • పోతారం సర్పంచ్, వార్డు సభ్యుల రాజీనామా 
  • డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:అధికార బీ ఆర్ ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మామడ మండలం పోతారం గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మామడ మండలంలోని పోతారం గ్రామస్తులు తీర్మానం చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు 500 మంది గ్రామస్తులు మూకుమ్మడిగా గులాబీ పార్టీకి మంగళ వారం గుడ్ బై చెప్పారు. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం యువకులు బలిదానాలు చేసుకోవద్దని చలించిన సోనియా గాంధీ రాష్ట్రానికి ఇస్తే సీఎం కేసీఆర్ కుటుంబం చేతిలో బంది అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందీ అయిన తెలంగాణకు విముక్తి కలిగించి సోనియా గాంధీకి బహుమతి ఇద్దామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేసి తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు కాపలా కుక్కల ఉంటానని మాట్లాడిన కేసీఅర్ దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారని విమర్శించారు. వందలాది మంది తెలంగాణ కోసం బలిదానం అయ్యారని, అయితే బాగుపడింది మాత్రం కేసీఆర్ కుటుంబమేనన్నారు. నిర్మల్ ప్రజల ఓట్లతో గెలిచిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మామడ మండలంలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. కేవలం ప్రభుత్వ భూముల కబ్జాలు, చెరువుల ఆక్రమణలతో దోచుకున్నారని విమర్శించారు. కబ్జాల మంత్రి, సండే ఎమ్మెల్యేతో ప్రజలకు ఒరిగింది ఏమీలేదని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరికీ తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 

జోరుగా కాంగ్రెస్ లోకి చేరికలు..

నిర్మల్ నియోజకవర్గంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో ఉంచుకుంటుంది.  బీఆర్ఎస్, బిజెపి పార్టీలపై విసుగు చెందిన నాయకులు పెద్ద ఎత్తున హస్తం గూటికి చేరుతున్నారు. మంగళవారం సారంగాపూర్ నిర్మల్ రూరల్ మండలం కు చెందిన వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.