కలెక్టర్ ఆదేశంతో గురుకులంలో అధికారుల ఆకస్మిక తనిఖీ

కలెక్టర్ ఆదేశంతో గురుకులంలో అధికారుల ఆకస్మిక తనిఖీ

 బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ మండల కేంద్రానికి సమీపంలోని గురుకుల సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో పలువురు అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బీబీనగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ యాదగిరి, ఇతర అధికారులు ప్రభాకర్, శేఖర్ రెడ్డి, కవితలు గురుకుల కళాశాలను సందర్శించారు. కళాశాలలోని వంటగది, భోజనశాల, స్టోర్ రూమ్, ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అలాగే విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను పరిశీలించారు. అలాగే వంటపాత్రలను తనిఖీ చేశారు.

తర్వాత విద్యార్థుల స్నానపు గదులు, వసతి గృహాలలో శుభ్రత పాటిస్తున్నారా లేదా అన్నది, వ్యర్థ పదార్థాలను పారవేసే ప్రదేశాలను కూడా అధికారులు పరిశీలించారు. అంతా సవ్యంగా వుందని, కళాశాల యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకుంటుండడం వల్ల అసాధారణ పరిస్థితులు ఏమీ కనిపించలేదని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.పాండురంగ శర్మ, డాక్టర్ సరోజ, కేర్ టేకర్ డాక్టర్ బి.శ్రీలత, అసిస్టెంట్ కేర్ టేకర్ సుష్మ, కళాశాల అధ్యాపక బృందాన్ని వారు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాలలో కంటిపరీక్షలు, హిమోగ్లోబిన్, జనరల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి డాక్టర్ సరోజ అనుమతి అడిగిన మేరకు అధికారులు అంగీకరించారు.