ప్రైవేటు పాఠశాలల్లో దోపిడీని అరికట్టలంటూ ఎబివిపి ధర్నా

ప్రైవేటు పాఠశాలల్లో దోపిడీని అరికట్టలంటూ ఎబివిపి ధర్నా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు, పుస్తకాల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలంటూ ఎబివిపి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి నాయకుడు శివ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల కొమ్ము కాస్తోందని విమర్శించారు. ఎన్నో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఫీజుల పేరిట లక్షలాది రూపాయలు దండుకుంటూ మధ్య తరగతి తల్లిదండ్రులను దోపిడీ చేస్తోందని విమర్శించారు. ఫీజుల దోపిడీ ఒక వైపు కొనసాగుతుండగా మరో వైపు పుస్తకాల పేరిట ప్రైవేటు సంస్థల పుస్తకాలను అమ్ముతూ దోపిడీ చేస్తోందని అన్నారు. అంతే కాకుండా బ్యాడ్జీలు, షూస్ వంటి వస్తువులను మార్కెట్ రేటు కంటే అధికంగా విక్రయిస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కానీ, అధికార యంత్రాంగం కానీ ఎలాంటి చర్యలను చేపట్టడం లేదని ధ్వజమెత్తారు.