ఏసీబీ వలలో మునిసిపల్ ఉద్యోగి .... రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

ఏసీబీ వలలో మునిసిపల్ ఉద్యోగి ....  రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పురపాలక సంఘంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న షాకీర్ ఖాన్ అదే కార్యాలయంలో ఉద్యోగి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ పురపాలక సంఘంలో తాత్కాలిక బిల్ కలెక్టర్ గా  పనిచేస్తున్న చందల భరత్ సర్వీసులు రెగ్యులర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన సర్వీస్ బుక్ లో రెగ్యులరైజేషన్ వివరాలు నమోదు చేయాలని కోరిన నేపథ్యంలో  షాకిర్ ఖాన్  రూ.20 వేలు డిమాండ్ చేశాడు. అయితే ఈ వివరాల నమోదుకు గత నెల రోజుల నుంచి వేధిస్తున్న క్రమంలో చివరికి రూ.15 వేలకు ఒప్పందం కుదిరింది.

బుధవారం ఉదయం షాకీర్ ఖాన్ కు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐ లు కృష్ణ కుమార్, కిరణ్ రెడ్డి లతో వల పన్ని పట్టుకున్నారు. ఇదిలా ఉండగా నిర్మల్ మున్సిపాలిటీలో అవినీతిపై పలుమార్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.   నిర్మల్ మున్సిపాలిటీలో మేనేజర్ గా పని చేస్తున్న గంగాధర్ ను కూడా ఏసీబీ అధికారులు గతేడాది దాడులు చేసి పట్టుకున్నారు. ఇదిలా ఉంటే కార్మిక శాఖ అధికారి అధికారి సాయిబాబా ఆయన కుమారుడు కూడా లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన గతంలో జరిగింది. ఇన్ని దాడులు జరుగుతున్నా ఇంకా అవినీతి తిమింగలాలకు కనువిప్పు కలగకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.