దేశంలో... రాష్ట్రంలో నియంతల పాలన సాగుతోంది

దేశంలో... రాష్ట్రంలో నియంతల పాలన సాగుతోంది
AICC President Mallikharjun Kharge

ఏఐ సీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : దేశంలో, రాష్ట్రంలో డిక్టేటర్ పాలన సాగుతోందని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాల శివారులో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్ష సభకు మల్లిఖార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈసందర్భంగా సభను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ, దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన చేస్తున్నారని విమర్శించారు. నరేంద్రమోదీ వ్యతిరేకులపై ఈడీ, సీఐడీ, ఐ టీ దాడులు చేయించి భయపెడతారని అన్నారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని ప్రశ్నించే వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం కాకుండా పేదలు, ధనికులకు ఓటు హక్కు కల్పించిందని గుర్తు చేశారు. అంతే కాదు నరేంద్రమోదీ ప్రధాని కావడానికి కూడా కాంగ్రెస్ తెచ్చిన సంస్కరణల పుణ్యమేనని చెప్పారు. గుజరాత్ లో బీజేపీ ఎంపీ పై క్రిమినల్ కేసునమోదు అయితే అనర్హత వేటు వేయని ప్రభుత్వం రాహుల్ గాంధీ విషయంలో వేగవంతంగా స్పందించడం శోచనీయమని అన్నారు. 

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ 9 ఏండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అనేది ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో కేసీర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కమీషన్లు ముట్టనీదే పనులు జరగవని అభియోగించారు. సింగరేణితో పాటు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటు పరం అవుతున్నా ప్రధానికి, కేసీఆర్ కు ఏ మాత్రం చింతలేదని అన్నారు.  అణగారిన వర్గాలు మాత్రం ఉపాధి లేక అల్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దళితుల పై అపారమైన ప్రేమను కురిపిస్తున్న కేసీఆర్  అంబెడ్కర్ పేరు పెట్టిన  ప్రాణహిత ,చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు నిలిపివేశావో ముక్కునేలకు రాసి ప్రజలను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.

అవినీతికి పాల్పడితే కన్నబిడ్డలను కూడా క్షమించనని చెప్పిన కేసీఆర్ కు దళితులు తప్ప కొడుకు, కూతురు, అల్లుని అవినీతి భాగోతం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లిక్కర్, పేపర్ లీకేజీలో పుత్రుడు, పుత్రిక పాత్ర ఉన్నా జైలుకు ఎందుకు పంపడం లేదు, పదవుల నుంచి ఎందుకు తొలగించడం లేదని నిలతీశారు. రాబోయే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో నిలువునా ముంచుతామని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ నిలిపివేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టితీరుతామని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను కాపాడుకుని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జి మానిక్ రావు ఠాక్రే,  రాష్ట్రానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సి, ముఖ్య నేతలు పాల్గొన్నారు.