జునోసిస్ దినోత్సవం సందర్భంగా ఎయిమ్స్ లో రంగోలి పోటీ

జునోసిస్ దినోత్సవం సందర్భంగా ఎయిమ్స్ లో రంగోలి పోటీ

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: ప్రపంచ జునోసిస్ వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా బీబీనగర్ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో శనివారం రంగోలి పోటీ నిర్వహించారు. ఎయిమ్స్ లోని మైక్రోబయాలజీ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్యామలా అయ్యర్ పర్యవేక్షించారు. ఈ పోటీలో ఎయిమ్స్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థిని దనలక్ష్మి మొదటి బహుమతి సాధించగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు సాక్షి, ప్రియదర్శిని వరుసగా రెండో, మూడో బహుతులు గెల్చుకున్నారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన విద్యార్థులకు వరుసగా రూ.1000, రూ.750, రూ.500 నగదు బహుమతులు అందించారు.    

ఈ కార్యక్రమంలో విద్యార్థులు చిత్రించిన రంగోలీలు మనుషులు, పెంపుడు జంతువుల మధ్య వ్యాధుల సంక్రమణంపై చక్కటి అవగాహన కల్పించాయి. ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 1885, జులైన 6న జోసెఫ్ మీస్టర్ అనే బాలుడికి రేబిస్ వ్యాక్సిన్ అందించిన విజయాన్ని జునోసిస్ దినోత్సవం గుర్తు చేస్తుంది. ఈ వ్యాధులతో పొంచివున్న ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, వాటి విస్తృతిని తగ్గించే పద్దతులను ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది. కాలక్రమంలో ప్రపంచ జునోసిస్ దినోత్సవం జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలను అభివృద్ధి పర్చడానికి, మానవులు, జంతువుల ఆరోగ్యాన్ని పరిరక్షించే విధానాల కోసం వాదించే ప్రపంచ వేదికగా పరిణామం చెందింది. నేషనల్ వన్ హెల్త్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ జూనోసెస్ (NOHP-PCZ) , సెంటర్ ఫర్ వన్ హెల్త్,  నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), న్యూఢిల్లీ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగింది. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియా, డీన్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ నారంగ్, వైద్యాధికారులు డాక్టర్ లక్ష్మీ జ్యోతి, డాక్టర్ నిఖత్ షీరిన్, డాక్టర్ ఆర్.శ్యామల అయ్యర్, డాక్టర్ రాజా.ఎస్, డాక్టర్ సునీల్ చవాన్, మరియు మైక్రోబయాలజీ విభాగం సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎయిమ్స్ అవుట్ పేషంట్ విభాగం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి దిగువస్థాయి సిబ్బందితో పాటు పలువురు రోగులు ప్రత్యక్షంగా తిలకించారు.