AP Assembly Polls: ఓట్లు ఎలా లెక్కిస్తారు? ఎవరెవరు ఏం చేస్తారు?

AP Assembly Polls: ఓట్లు ఎలా లెక్కిస్తారు? ఎవరెవరు ఏం చేస్తారు?
  • ఒక నియోజకవర్గ కౌంటింగ్‌ పర్యవేక్షణ, బాధ్యత రిటర్నింగ్ అధికారిదే
  • ఆర్‌వోకు సహాయంగా ఉండనున్న అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు
  • ఒక టేబుల్‌ వద్ద కౌంటింగ్ బాధ్యత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిదే
  • పోస్టల్ బ్యాలెట్ టేబుల్‌ కౌంటింగ్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షించనున్న ఆర్‌వో

లోక్‌సభ ఎన్నికలు-2024, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జూన్ 1న ఏడవ దశతో ప్రశాంతంగా ముగియడంతో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ నెలకొంది. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిన్ననే ముగియడంతో లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఆసక్తి నెలకొంది. ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది. మంగళవారం ఉదయం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ షురూ కానుంది. ఈ నేపథ్యంలో అసలు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎవరెవరు ఏం చేస్తారు? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

ఓట్లు ఎలా లెక్కిస్తారు?

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చాలా విస్తృతమైనది. లక్షలాది మంది ప్రజలు ఓటు హక్కుని వినియోగించుకుంటారు కాబట్టి లెక్కింపు ప్రక్రియలో వేలాది మంది అధికారులు భాగస్వాములు అవుతారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వికేంద్రీకరిస్తారు. లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఏకకాలంలో 543 నియోజకవర్గాలలోని కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.

ఎవరెవరు ఏం చేస్తారో తెలుసా?

పార్లమెంటరీ నియోజకవర్గానికి కేటాయించిన రిటర్నింగ్ అధికారి (ఆర్‌వో) కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఓట్ల లెక్కింపు బాధ్యతలను ఆయన నిర్వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆర్‌వోని నియమిస్తుంది. సాధారణంగా స్థానిక ప్రభుత్వ అధికారిని ఆర్‌వోగా ఎంపిక చేస్తారు. ఇక ప్రతి నియోజకవర్గంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌వో ఉంటారు. వీరు ఆర్‌వోకి సహాయంగా ఉంటారు. ఒక టేబుల్ వద్ద ఈవీఎం లెక్కింపుకు బాధ్యతను ఏఆర్‌వో నిర్వహిస్తారు. ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌ను ఆర్‌వో పర్యవేక్షిస్తారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతి టేబుల్‌ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ సూపర్‌వైజర్ ఉంటారు. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా గమనిస్తుంటారు. నియోజకవర్గానికి సంబంధించిన రౌండ్లు, ఓట్ల సంఖ్య ఆధారంగా ఫలితం వెలువడే సమయం ఆధారపడి ఉంటుంది.

ఎక్కడ లెక్కిస్తారు?

ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గానికి ఒకే ప్రదేశాన్ని కేటాయిస్తారు. అయితే ఓటర్ల సంఖ్య భారీగా ఉంటే మరిన్ని కౌంటింగ్ కేంద్రాలను కేటాయించే అవకాశాన్ని ఈసీ కల్పిస్తుంది. ఇందుకోసం పెద్ద హాల్‌ను ఎంపిక చేస్తారు. సాధారణంగా ప్రభుత్వ బడులు, కాలేజీలు లేదా సంబంధిత నియోజకవర్గానికి సంబంధించిన ఆర్‌వో ప్రధాన కార్యాలయాన్ని కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేస్తారు.

ఇక ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాన్ని ఆర్‌వో ప్రకటిస్తారు. ఈ ఫలితాలు సాధారణంగా టీవీ, ఇతర మీడియా మాధ్యమాల ద్వారా ముందుగానే జనాలకు చేరతాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అధికారికంగా ప్రకటిస్తుంది.