ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దుర్భరం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దుర్భరం
AP government employees condition is miserable

జీతాల కోసం, ప్రైవేటు ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చును. ఆందోళనకు దిగారంటే సరిపెట్టుకోవచ్చు. సమ్మెకు దిగారంటే ఔను మరేంచేస్తారని సమాధాన పడొచ్చు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు వీధుల్లోకి రావడం, ఆందోళనలకు దిగడం, సమ్మె చేయడం కాదు ఏకంగా గవర్నర్‍  ను కలిసి, ప్రతి నెలా ఫస్ట్  కు జీతాలు ఇప్పించండి మహా ప్రభో అని మొరపెట్టుకోవడం బహుశా  దేశ చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చు. ఆ మొదటి గౌరవం ఆంధప్రదేశ్‍ కే దక్కింది. ఇప్పటికే అక్షర క్రమంలో కాదు అప్పుల్లో కూడా ఏపీయే ఫస్ట్ అనిపించుకున్న ఏపీ ఇప్పుడు.. ఉద్యోగులే జగన్‍  ప్రభుత్వంపై గవర్నర్‍ కు ఫిర్యాదు చేసి.. గౌరవ ముఖ్యమంత్రి నిర్వాకం ఎలా ఉందో యావద్దేశానికీ చాటారు.  రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభత్వ ఉద్యోగులు రాష్ట్ర గవర్నర్‍ కు ఫిర్యాదు చేయడం ఏదైతే వుందో అది నభూతో న భవిష్యతి.. అన దగిన అద్భుత సన్నివేశం. ఇటువంటి ఘటన అంటే ప్రభుత్వోద్యోగులు  జీతాలకోసం గవర్నర్‍ ని కలవడం అనేది దేశచరిత్రలో  గతంలో ఎన్నడూ జరగలేదు.. భవిష్యత్తులో జరిగే అవకాశం లేదు. ఔను భవిష్యత్‍ లో జరిగే అవకాశం లేదని ఉద్యోగులే చెబుతున్నారు. ఎందుకంటే జగన్‍ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాదు కనుక అంటున్నారు. మరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా  ఇంతటి అధ్వాన పాలన చేయడం జగన్‍ కు వినా మరెవరికీ సాధ్యం అయ్యే పని కాదని వారు అంటున్నారు. 

సరే ఉద్యోగులు గవర్నర్‍ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు ఇచ్చిన ఘటన ఉద్యోగ సంఘాల మధ్య చీలికకు కారణమైందంటే అదే వేరే విషయం. ఉద్యోగసంఘం నేతలు రాష్ట్ర గవర్నర్‍ ని కలవడం, రాష్ట్ర ఆర్థికపరిస్థితి దిగజారిందనడానికి నిదర్శనం. ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇప్పించాలని, రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇప్పించాలని ఉద్యోగసంఘాలు గవర్నర్‍ ని కోరాయి. ఉద్యోగ సంఘాలు గవర్నర్‍ ని కలవడం అనేది సాధారణమే. కానీ జీతాల కోసం గవర్నర్‍ ని కలవడం దేశంలో ఇదే తొలిసారి. ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్‍ లో సమ్మె చేస్తామన్నారు. జనవరి జీతాలు ఫిబ్రవరి నెల్లో కూడా ఇవ్వలేమని, ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.అప్పులు పుడితేనే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉంది. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. జీతాల కోసం ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వాన్ని కాకుండా గవర్నర్‍ ను ఆశ్రయించి గోడు వినిపించుకునే పరిస్థితి వచ్చిందంటే ఫైనాన్షియల్‍ ఎమర్జెన్సీ అని కాక ఇంకేం అనాలి. ఇప్పటికే 7 వేల కోట్ల డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది.  

గతంలో పీఆర్సీ సందర్భంలో ఉద్యోగులకు రూ.2,500కోట్లు ఇవ్వాల్సి ఉందని, మార్చి 2022 నాటికి ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికీ ఆ బకాయిలు ఇవ్వలేదు. జీపీఎఫ్‍ అడ్వా న్స్ లు కూడా ఇవ్వని ప్రభుత్వం, వాటినికూడా వాడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.480 కోట్లు వాడుకుందని కేంద్రమే చెప్పింది.ఈ ప్రభుత్వానికి హక్కులపై ఉన్న అవగాహన బాధ్యతలపై లేదు. అలవెన్సుల విషయంలో పోలీస్‍ శాఖ కన్నీళ్లు పెట్టుకుంటోంది. చాలా మంది పోలీసు లు వారి జీతాల్లో 25శాతం సొమ్ముని టీ.ఏ, డీ.ఏలకు ఖర్చుపెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు  ఏడుపే మిగిల్చింది. గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 50 జీవోలు ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ,  పీఆర్సీ, ఇతర త్రా ప్రయోజనాలన్నీ నెరవేర్చింది..ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం పెట్టేవారికి బిల్లులు చెల్లించడంలేదు, ఆరోగ్యశ్రీ  బకాయిలు ఇవ్వడంలేదు. 

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన వైద్యులు, నర్సులకు హై కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప, ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు. ఆప్కాస్‍ లోని లక్షమంది ఔట్‍ సోర్సింగ్‍ సిబ్బందికి ఈ ప్రభుత్వం ఏనాడూ కరెక్ట్ గా జీతాలు ఇవ్వలేదు?  ప్రభుత్వం చేయాల్సింది సకాలంలో జీతాలు, ఇతరత్రా ప్రయోజ నాలు ఉద్యోగులకు కల్పించడం.  ఆ పని చేయని ప్రభుత్వం.. మాట్లాడితే కేసులంటూ, ఉద్యమం చేస్తామంటే నిర్బంధాన్ని ప్రయోగిస్తుంటే.. ఉద్యోగులు గవర్నర్‍ ను కలవకుండా ఇంకేం చేస్తారు. గవర్నర్‍ ను కలిసి ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగ నేత.. ఉద్యోగులకు కాకుండా జగన్‍ కు ప్రతినిథిగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి.  మొత్తంగా ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఇప్పుడు జరుగుతున్న మాటల యుద్ధం ఒక విధంగా ఉద్యోగులు సమస్యలపై నిరసన గళం విప్పకుండా అడ్డుకుంటూ పరోక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తోందనడంలో సందేహం లేదు.