ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసై ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
- జిల్లా కలెక్టరేట్లో విధుల్లో ఉండగానే సర్వీస్ రైఫిల్ తో కాల్చుకొని ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసై ఓ ఏఆర్ కానిస్టేబుల్ విధుల్లో ఉండగానే సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మంచాల మండల కేంద్రానికి చెందిన దూసరి బాలకృష్ణ గౌడ్ (28) ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత కొంత కాలంగా బాలకృష్ణ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లో బెట్టింగ్ కాస్తున్నాడు. బెట్టింగ్ కు బానిస కాగా ఇటీవల అప్పులు చేసి మరీ డబ్బులు బెట్టింగ్ లో పెట్టి నష్టపోయాడు.
దీంతో అప్పుల బాధ తాళలేక శనివారం తెల్లవారుజామున తాను రాత్రి గస్తీ నిర్వహిస్తున్న కొంగర కలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బాత్రూం గదిలోకి వెళ్లి, తలుపులు మూసివేసి తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన గురించి సమాచారం అందగానే ఆదిభట్ల పోలీసులు మృతదేహాన్ని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా సమయంలో మృతుడితోపాటు ముగ్గురు సహ ఉద్యోగులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. అయితే మరణానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని, మృతుడు ఆన్లైన్ గేమ్స్ బానిసై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.