నెల రోజుల ఉత్కంఠకు తెర.. వీగిపోయిన అవిశ్వాసం

నెల రోజుల ఉత్కంఠకు తెర.. వీగిపోయిన అవిశ్వాసం
  • అవిశ్వాసంపై చర్చకు కౌన్సిలర్ ల గైర్హాజరు
  • సంబురాలు జరిపిన చైర్ పర్సన్ వర్గం
  • అధర్మంపై ధర్మం గెలిచింది.. చైర్ పర్సన్ కప్పరి స్రవంతి


ముద్ర ప్రతినిధి, ఇబ్రహీంపట్నం: నెల రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ పై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ లు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసంపై చర్చకు చైర్ పర్సన్ తో పాటు అధికార పార్టీ కౌన్సిలర్ లు, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ లు గైర్హాజరయ్యారు. దీంతో చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. గత నెల 15న ఫామ్ 1 ప్రకారం జిల్లా కలెక్టర్ కు అవిశ్వాసంపై నోటీసులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవిశ్వాసంపై ఉదయం 10:30 గంటలకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్ ల సమక్షంలో చర్చకు ముహూర్తం ఖరారు కాగా బలనిరూపణకు గంట సమయం ఇచ్చారు. కౌన్సిలర్ లు రాకపోవడంతో ఆర్డీఓ మరో అర్ధ గంట సమయం ఇచ్చారు. అప్పటికి కౌన్సిలర్ లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీఓ అనంత రెడ్డి ప్రకటించారు. మొత్తం 24 మది పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యునితో మొత్తం 25 మంది సభ్యులకు ఫామ్ 2 ప్రకారం ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. వారిలో ఒక్కరు కూడా హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు చెప్పారు. అవిశ్వాసం విగిపోయిన విషయంపై జిల్లా కలెక్టర్ కు నివేదిక అందిస్తామని తెలిపారు. 

మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో భారీ భద్రత

అవిశ్వాసంపై చర్చ సంధర్బంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ పీటర్ వత్సల రాజు నేతృత్వంలో ఎస్ఐ మారయ్యతో పాటు పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆయా పార్టీల నాయకులను పరిసరాల్లోకి అనుమతించలేదు. అవిశ్వాసం వీగిపోయిందని ఆర్డీఓ ప్రకటించిన వెంటనే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబురాలు జరిపిన చైర్ పర్సన్ వర్గం

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ పై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ లు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో చైర్ పర్సన్ వర్గం సంబురాలు జరిపారు. మున్సిపల్ కేంద్రంలోని చౌరస్తాలో బాణసంచా కాల్చి ర్యాలీ నిర్వహించారు. దళిత మహిళ చైర్ పర్సన్ గా ఉండడం ఇష్టం లేక అన్యాయంగా తనపై అవిశ్వాసం ప్రవేశ పెట్టారని చైర్ పర్సన్ కప్పరి స్రవంతి తెలిపారు. అధర్మంపై ధర్మం గెలిచిందని, తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. తనకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, తన పక్షాన నిలిచిన కౌన్సిలర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.