2వేల మంది భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా

2వేల మంది భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా
  • బీమా బాండ్లు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్ రాహుల్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల లోని భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న రెండు వేల మందికి బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల సహకారంతో  కార్మికులకు  ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ఒక బలమైన సంఘంగా ఏర్పడి ఇంత పెద్ద ఎత్తున కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించడం సంతోషాదాయకమని అన్నారు. పనిలో భద్రత ఉన్నప్పుడే కార్మికుని కుటుంబం బాగుంటుందని అన్నారు.  ఇతర రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఇన్సూరెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని సూచించారు. భవన నిర్మాణ కార్మికులు మరణించిన గాయాల పాలైన వారి కుటుంబానికి అండగా బీమా పాలసీ నిలుస్తుందని చెప్పారు. కార్మికుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరింతగా పనిచేయాలని కార్మిక సంఘాల నేతలను కోరారు. ఒక్క రోజులోనే రెండు వేల మందికి ఇన్సూరెన్స్ చేయడం భారత్ వరల్డ్ రికార్డు లో చోటు దక్కడం పట్ల ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్, బీఆరెస్ నాయకుడు నడిపెళ్ళి విజిత్ రావు కార్మిక శాఖ అధికారులు  పాల్గొన్నారు.