ప్రలోభాలను నిరోధించేందుకు పారదర్శకంగా పనిచేయాలి

ప్రలోభాలను నిరోధించేందుకు పారదర్శకంగా పనిచేయాలి


 జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
ముద్ర ప్రతినిధి, వనపర్తి : ఎన్నికల్లో ప్రలోభాలను నిరోధించి  పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్ఫోర్స్ మెంట్ బృందాలు పకడ్బందీగా నిఘా పెట్టాలని   జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు, వాణిజ్య పన్నులు, అబ్కారీ, ఆదాయ పన్నులు, ఇంటలిజెన్స్, బ్యాంకు శాఖల అధికారులతో ఎన్ఫోర్స్ మెంట్  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల్లో ప్రలోభాలను అరికట్టేందుకు  ఒక్కో శాఖ పరంగా చేయాల్సిన పనులు, వివిధ శాఖల మధ్య సమన్వయం పై దిశా నిర్దేశం చేశారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలను ఎప్పటి కప్పుడు పసికట్టి  అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ప్రలోభాలకు పాల్పడే వారి పై కేసులు బుక్ చేసేవిధంగా  కఠిన చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.  

నిఘా వివరాలపై శాఖల వారీగా కలెక్టర్‌ ఆరా

జిల్లాలో చేపడుతున్న నిఘా వివరాలపై శాఖల వారీగా కలెక్టర్‌ ఆరా తీశారు.  పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా మద్యం, నగదు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగకుండా పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశించారు. బెల్టు షాపులు, సారా దుకాణాలపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టులో నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీ, వీఎస్టీ తదితర అన్ని టీములు అప్రమత్తంగా ఉండి  తనిఖీలు చేయాలని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని, ఫేక్ న్యూస్ లను అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెక్‌పోస్టుల్లో సీజ్‌ చేసిన వివరాలను ప్రతీరోజు పోర్టల్ అప్లోడ్ చేయాలని  అదేశించారు. ఐటీ, వాణిజ్య పన్నులు, ట్రెజరీ సహా అన్ని విభాగాల అధికారులు ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. బ్యాంకుల్లో జరిగే లావాదేవీల పై గట్టి నిఘా పెట్టాలని అనుమానిత లావాదేవీలు, 10లక్షలకు మించిన లావాదేవీల పై నిఘా పెట్టాలని బ్యాంకర్లను సూచించారు.   అనుమానాస్పద లావాదేవీల సమాచారాన్ని ఐటీ శాఖకు అందించాలని ఆదేశించారు.  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలు చేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) యం. నగేష్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో పద్మావతి, డీటీవో, ఐటీ, పోస్టల్, అబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు పాల్గొన్నారు.