గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి
  • డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌, కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ అభ్యర్థి కూచాడి శ్రీహరి రావు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు నిర్మల్ రూరల్ మండలం, నర్సాపూర్ (జి) మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఆదివారం పెద్ద ఎత్తున  హస్తం గూటికి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు, ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన అనంతరం చేసే ఆరు హామీల పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్, దళిత డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, గృహ జ్యోతి, మహాలక్ష్మి, చేయూత పథకాలను ప్రకటించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీల పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు.

కాంగ్రెస్ నాయకుల సంబరాలు ఇదిలా ఉండగా నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావును పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. నిర్మల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అన్నారు.  జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పీసీసీ సభ్యుడు సాద సుదర్శన్, నాయకులు పొడేల్లి గణేష్, అర్జుమాన్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, జునైత్, చిన్ను, అరవింద్, గణేష్, గాజుల రవి కుమార్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.