రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైల్వేలకు మహర్దశ  - ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు

రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైల్వేలకు మహర్దశ   - ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రైల్వేలకు మరింత మహర్దశ చేకూరనుందని ఎంపి సోయం బాపురావు అన్నారు. అమృత్ భారత్ లో భాగంగా రైల్వేల అభివృద్ధికి చేపట్టిన అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రధాని మోదీ మంగళ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపు రావు మాట్లాడుతూ రైల్వే స్టేషన్లను ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దాలనేది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు.  ఈ పథకంలో భాగంగా బాసర లో రూ.11.33 కోట్లతో రైల్వేస్టేషను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని పేర్కొన్నారు.

2014-15 తో పోలిస్తే తెలంగాణ రైల్వే బడ్జెట్ లో 2024-25 నాటికి కేటాయింపులను రూ.5,070 కోట్లకు 20 రెట్లు పెంచడం తెలంగాణ రైల్వేల అభివృద్ధికి మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు కేంద్రం కొత్త రైలు సౌకర్యం కల్పించిందన్నారు. స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఇటీవలే జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైల్వేలో అపూర్వమైన అభివృద్ధిని సాధించేందుకు మరింత కృషి చేస్తామని, రాష్ట్రంలోని రైల్వే రూపు రేఖలను సమూలంగా మారుస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే రామారావు పటేల్, సెంట్రల్ రైల్వే బోర్డ్ సివిల్ ఇంజనీర్ సచిన్, డీఎంఓ కవిత, బిజెపి జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు, బిజెపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు రైల్వే ప్రయాణికులు, తదితరులు ఉన్నారు.