అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి

అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి
  • ధాన్యం తరలించే లారీలను సంఖ్యను పెంచండి
  • జడ్పీలో స్థాయి సంఘ సమా వేషంలో జడ్పీ చైర్మన్ ఆదేశం

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: అకాల వర్షాల బారిన పడకుండా వడగండ్ల వాన వల్ల రైతులు నష్టపోకుండా ఉండడానికి ముందస్తు సాగు ప్రణాళికపై రైతులకు అవగాహన కల్పించాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో జరిగిన 2,3,4,( వ్యవసాయం గ్రామీణ అభివృద్ధి విద్య మరియు వైద్యం) స్థాయి సంఘ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్  మాట్లాడుతూ ఆలస్యంగా వరి నాట్లు వేయడం వల్ల యాసంగి సీజన్లో వడగండ్ల వాన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ముందుగానే వరినాట్లు వేసినట్లయితే వరి కోతలు తొందరగా పూర్తయి అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ఉంటారని అన్నారు. ఈ విషయంలో రైతులకు కలిగే సందేహాలను నివృత్తి చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు చొరవ చూపాలని అన్నారు. వానకాలం వరి నారు రోహిణి కార్తిలో యాసంగి వరినారు అనురాధ కార్తీలో  వరినారు పోసినట్లయితే త్వరగా నాట్లు పడి రైతులు నష్టపోకుండా ఉంటారని అన్నారు.

 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిరంతరం జిల్లా అధికారులు సమన్వయం చేస్తూ ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.  ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుండి తరలించడానికి అవసరమైన వాహనాలను (లారీలను) అందేలా ట్రాన్స్పోర్ట్ అధికారులు దృష్టి సారించాలని అన్నారు.  అదేవిధంగా  మంత్రి తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు అవసరమైన ఆయిల్ ఫామ్ మొక్కలు జిల్లాలోని నర్సరీలో అందుబాటులో ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జూన్ రెండవ తేదీ నుండి జూన్ 21 వరకు జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ కీర్తి ప్రతిష్టతలను ప్రతిబింబించే విధంగా జరిగేటట్టు ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని అన్నారు.

మన ఊరు మనబడి ద్వారా జిల్లాలో జరుగుతున్న పనులను విద్యా సంవత్సరం ప్రారంభం లోపు పూర్తిచేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపేందుకు కృషిచేసిన జిల్లా విద్యాశాఖ అధికారులకు  ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించడానికి నిరంతరం ప్రజాప్రతినిధులను అధికారులను ప్రోత్సహిస్తూ ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా మంత్రి హరీష్ రావు గారికి విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యవసాయ స్థాయి సంఘ సమావేశానికి వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారు అధ్యక్షత వహించగా విద్య,వైద్య ఆరోగ్య స్థాయి సంఘాలకు జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాల్లో జడ్పిటిసిలు లింగాయపల్లి యాదగిరి,కుంబాల లక్ష్మి, పంగా మల్లేశం, అనంతుల అశ్విని, గిరి కొండల్ రెడ్డి, జెడ్పి సీఈఓ రమేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.