వివిధ విభాగాల రుణాలకు లక్ష్యాల కేటాయింపు

వివిధ విభాగాల రుణాలకు లక్ష్యాల కేటాయింపు
  • ఈ ఆర్థిక సంవత్సరం 5147.62 కోట్లతో వార్షిక ప్రణాళిక విడుదల
  • వ్యవసాయ, వ్యవసాయేతర, పరిశ్రమలకు పెద్దపీట
  • అదనపు కలెక్టర్  మంద మకరందు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వ్యవసాయ, వ్యవసాయేతర, పరిశ్రమలకు జిల్లా వార్షిక రుణ ప్రణాళిక పెద్దపీట వేసినట్లు  అదనపు కలెక్టర్  మంద మకరందు తెలిపారు.  2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లీడ్ బ్యాంక్ అధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  మంద మకరందు   జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వ్యవసాయ, వ్యవసాయేతర, విద్య, గృహ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు కేటాయిస్తూ ఈ ఏడాది వార్షిక ప్రణాళిక లక్ష్యం 5147.62 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. పంట రుణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రూ. 3698.91 కోట్లు, టర్మ్ రుణాలు రూ. 834.72, వ్యవసాయ మౌలిక సదుపాయాలు రూ. 139.82 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలపై రూ. 333.85 కోట్లు, వ్యాపార రంగాలకు రూ. 1086.87 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ. 162.40 కోట్లు, అప్రధాన్యత రంగాల రుణాలను రూ. 199.44 కోట్లుగా కేటాయించినట్లు తెలిపారు. జగిత్యాల జిల్లాలో అధికంగా వ్యవసాయ రంగం పైనే ఆధారపడి జీవిస్తుండటంతో ఆ రంగం పైనే ఏటా పంట రుణాలు పెంచుతున్నట్లు తెలిపారు. 

పంట పెట్టుబడులు ఏడాది కేడాది పెరుగుతుండటంతో రైతులు రెన్యూవల్ చేసుకునే వారికి ఇబ్బంది కలగకుండా పంటలపై రుణాలు అందజేస్తున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. అలగే దీర్ఘకాలిక పెట్టుబడి రుణాల్లో హార్టికల్చర్ కింద పండ్ల తోటలకు,ల్యాండ్ లెవలింగ్ కు, పౌల్ట్రీ, చేపల పెంపకం తదితర వాటికి బ్యాంకులు రుణాలు అందిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు వ్యవసాయ అనుబంధ కింద ప్రైవేటు మార్కెట్ యార్డులు, కోల్డ్ స్టోరేజీలు, గోదాముల నిర్మాణాలకు అర్హులైన వారికి రుణాలు మంజూరు చేస్తామని రైతులు ముందుకు రావాలని బ్యాంకర్లు కోరుతున్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఎల్ డిఓ  తేజ్ దీప్త బెహరా, నాబార్డ్ ఎజిఎం మనోహర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ శంకర్ హెంబ్రం,  జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్ రెడ్డి, డిఆర్ డిఓ  లక్ష్మి నారాయణ, వివిధ శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల కంట్రోలర్స్, బ్యాంక్ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.