అమూల్ వర్సెస్ నందిని

అమూల్ వర్సెస్ నందిని

కర్ణాటక ఎన్నికల్లో వింత ప్రచారం

బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో ఎటువంటి అంశమైనా ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఇప్పుడు సరి కొత్తగా పాల వివాదం ముదురుతోంది. గుజరాత్ నుంచి వచ్చే అమూల్ పాలకు కర్ణాటకలో స్థానికంగా సరఫరా అయ్యే నందిని పాల ఉత్పత్తులకు గట్టి పోటీ ఏర్పడింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నడిపే డైరీ సంస్థ సరఫరా చేసే నందిని పాలకే ఇప్పటివరకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు గుజరాత్ కేంద్రంగా పనిచేసే అమూల్ సంస్థ తమ పాల ఉత్పత్తులను త్వరలో కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రవేశపెట్టనుంది. అమూల్ పాలు ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా త్వరలో అందుబాటులోకి రానున్నాయని ఆ సంస్థ ప్రకటించింది.

ఇప్పుడు ఈ రెండు పాల ఉత్పత్తుల సంస్థల మధ్యనే కాకుండా ఈ అంశంపై రాజకీయ పార్టీల మధ్య కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు జోరుగా సాగుతున్నాయి. అమూల్ సంస్థ ద్వారా తమ పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టి కర్ణాటక ప్రజలను లూట్ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కంకణం కట్టుకున్నారంటూ కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అసలే అవినీతి ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బిజెపికి అమూల్ పాల ఉత్పత్తులు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.