గాడిద పాల పేరిటి ఘరానా మోసం ... వెలుగులోకి వచ్చిన రూ.100 కోట్ల  భారీ స్కామ్

గాడిద పాల పేరిటి ఘరానా మోసం ...  వెలుగులోకి వచ్చిన రూ.100 కోట్ల  భారీ స్కామ్
  • యూట్యూబ్ లో గాడిద పాల గురించి ప్రమోషన్
  • నట్టేట మునిగిన తెలుగు రాష్ట్రాల రైతులు
  • ఒక్కో గాడిద రూ. 80 వేల నుంచి రూ.1.50 లక్షలకు విక్రయం 
  • లీటర్ పాలు రూ.1600లకు కొంటామని రైతులను నమ్మించారు
  • ఒక్కో రైతు దగ్గర రూ. 5 లక్షల వరకు డిపాజిట్ సేకరణ
  •  మోసం చేసిన తమిళనాడుకు చెందిన డ్యాంకీ ప్యాలెస్ సంస్ధ 
  • ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరిన బాధితులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ మధ్య కాలంలో గాడిద పాల వినియోగంపై జనాలలో పెరిగిన డిమాండ్ ను ఆసరాగా చేసుకుని తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహిక రైతులకు గాడిద పాల ఉత్పత్తి, లాభాలు ఆశ చూపించి , నట్టేట ముంచింది. ఫ్రాంచైజీ మోడల్ లో గాడిద పాలు తీసుకున్న తమిళనాడుకు చెందిన డాంకీ ప్యాలెస్ సంస్థ దాదాపు రూ.100 కోట్లు వరకు రైతులసు ఎగనామం పెట్టింది. ఆన్ లైన్ లో ఒక్కో గాడిదను లక్షన్నర రూపాయలకు రైతులకు అంటగట్టింది. లీటర్ గాడిద పాలను రూ.1600లకు కొంటామని నమ్మబలికింది. ఈ విథంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 400  మంది రైతులకు గాడిదలను విక్రయించింది.

తమిళనాడులోని తిరునాళ్వేకి చెందిన డాంకీ ప్యాలెక్ సంస్థ అన్ లైన్ లో గాడిదల పెంపకం, పాలు వ్యవహారాన్ని ప్రమోట్ చేసింది. డాంకీ ప్యాలెస్ మిస్టర్ బాబు ఉలగనాథన్ ఆధ్వర్యంలో గిరి సుందర్, బాలాజీ, సోనిక రెడ్డి, డాక్టర్ రమేష్ డాంకీ ప్యాలెస్ సంస్థను ఏర్పాటు చేశారిు. సోనికా రెడ్డి యూట్యూబ్ లో ప్రమోట్ చేశారు. కరోనా నేపథ్యంలో బహుళ పోషకాలు, రోగ నిరోధక శక్తినిచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉంటుందని యూట్యాబ్ లో బాగా ప్రచారం చేశారు. అవి చూసి ఔత్సాహిక రైతులు వారిని సంప్రదించారు. డాంకీ ప్యాలెస్ సంస్థకు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కో రైతు రూ.5 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బాధిత రైతులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాంకీ ప్యాలెస్ ప్రాంఛైజీ గ్రూప్ సభ్యులు తమను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన గాడిద పాల ఉత్పత్తిదారులు, ఔత్సాహిక రైతులు, మహిళలు తమ గోడు వెల్లబోసుకున్నారు. డాంకీ ప్యాలెస్ సంస్థ నుంచి ఒక్కో గాడిదను రూ. 80 వేలు నుంచి రూ.1.50 లక్షలకు కొనుగోలు చేసి, లీటర్ పాలు రూ.1600 చొప్పున విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నామని బాధితులు చెప్పారు. మూడు నెలల పాటు నమ్మకం కలిగించేలా నగదు చెల్లించారని, ఆ తర్వాత నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదని వాపోయారు. దీనిపై డాంకీ ప్యాలెస్ నిర్వహకులను నిలదీయగా, ఒక్కొక్కరికి రూ.15 లక్షల నుంచి రూ.70 లక్షల చొప్పున బ్యాంకు చెక్కులు ఇచ్చారని, అవి కాస్తా బౌన్స్ అయ్యాయని ఆవేదన చెందారు. ఇదో పెద్ద స్కామ్ అని , దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండవచ్చని బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై చెన్నైలో ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా, అక్కడ పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. డాంకీ ప్యాలెస్ సంస్థ ఒప్పందలో పేర్కొన్న జీఎస్ టీ నెంబర్లు, ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ లైసెన్స్ కూడా నకిలీవేనని వారు తెలిపారు. ఈ స్కామ్ పై తెలుగు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. లేనిపక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.