హెచ్‌3ఎన్‌2 వైరస్‌ లక్షణాలతో మరొకరి మృతి

హెచ్‌3ఎన్‌2 వైరస్‌ లక్షణాలతో మరొకరి మృతి

వడోదర: హాంగ్‌కాంగ్‌ ఫ్లూగా పేర్కొనే హెచ్‌3ఎన్‌2  ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ కలవరపెడుతోంది.
ఈ వైరస్‌ లక్షణాలతో కర్ణాటకలో తొలి మరణం నమోదు కాగా.. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో 58 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం వడోదరలోని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు. మహిళ మరణానికి ప్రస్తుతం కలవరపెడుతోన్న హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైద్యులు మాట్లాడుతూ.. వడోదరలోని ఫతేగంజ్‌కు చెందిన ఈ మృతురాలికి సంబంధించిన శాంపిల్స్‌ను పరీక్షించేందుకు రివ్యూ కమిటీకి పంపినట్టు తెలిపారు.

గుజరాత్‌లో గత వారం రోజుల క్రితం వరకు హెచ్‌3ఎన్‌2 కేసులు మూడు నమోదయ్యాయని ఆరోగ్యమంత్రి హృషికేశ్‌ పటేల్‌ ఇటీవల వెల్లడించారు. మార్చి 10 వరకు గుజరాత్‌లో 80 సీజనల్‌ ఫ్లూ కేసులు నమోదవ్వగా.. వాటిలో 77 ఇన్‌ఫ్లూయెంజా హెచ్‌1ఎన్‌1 కేసులు కాగా.. మూడు హెచ్‌3ఎన్‌2 ఉపరకం కేసులే ఉన్నాయన్నారు. ఇంకోవైపు, ఈ ఫ్లూ లక్షణాలతో ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది.