సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలలో అపశృతి

సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలలో అపశృతి
  • గుండెపోటుతో మృతి చెందిన చంద్రయ్య
  • గుండెపోటుతో ఒకరు ఊపిరాడక ఇద్దరు మృతి
  • లోయలో రద్దీ కారణంగా ముగ్గురు మృతి

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి:నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాపూర్ చెంచుపెంట గ్రామపంచాయతీ పరిధిలోని నల్లమల అభయారణ్యంలోని సలేశ్వరం లోయలో చెంచుగిరిజనులు నిర్వహిస్తున్న లింగమయ్య చైత్ర పౌర్ణమి ఉత్సవాలలో గురువారం అపశృతి చోటుచేసుకుంది. రద్దీ కారణంగా గుండెపోటుతో ఒకరు, తొక్కి సలాటలో ఊపిరాడక మరో ఇద్దరు మృతి చెందారు. నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో సలేశ్వరం క్షేత్రంలో వెలిసిన లింగమయ్య స్వామి దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచేకాక దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో లోయలో విపరీతమైన రద్దీ పెరిగింది. అధికారులు సరైన వసతులు భక్తులకు తగినట్లు ఏర్పాట్లను చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రద్దీ పెరగడంతో కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిలబడి లింగమయ్యస్వామి దర్శనం కోసం పడి కాపులు పడ్డారు. భక్తుల రద్దీ కారణంగా ఊపిరాడక నాగర్ కర్నూల్  జిల్లా వనపట్ల గ్రామానికి చెందిన  గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతి చెందినట్లు శ్రీనివాసులు తెలిపారు. కాగా లోయలో తొక్కిసలాట వల్ల ఊపిరాడక వనపర్తి జిల్లాకు చెందిన అభిషేక్ (32) ఆమనగల్ కు చెందిన విజయ (40) మృతి చెందారని సమాచారం. కొండ చరియల నుండి  ఒక రాయి పై నుండి కింద ఉన్న భక్తులపై పడగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రద్దీ కారణంగా చాలామంది స్వామివారిని దర్శించుకోకుండానే నిరాశతో వెను తిరుగుతున్నారు. వారం రోజులపాటు నిర్వహించాల్సిన ఈ జాతరను కేవలం మూడు రోజుల పాటు అధికారులు నిర్వహించడం వల్ల రద్దీ పెరిగి అపశృతి చోటు చేసుకున్నదని చెంచు లోకం  రాష్ట్ర అధ్యక్షులు  కాట్రాజు శ్రీనివాసులు అన్నారు.  చెంచుల  ఆరాధ్య దైవమైన లింగమయ్య స్వామి ఉత్సవాలను 8  రోజులపాటు  నిర్వహించాలని  అధికారులను కోరారు.