పకడ్బందీగా ఎన్నికల కోడ్

పకడ్బందీగా ఎన్నికల కోడ్

జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య
కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌‌ ప్రారంభం 

ముద్ర ప్రతినిధి, జనగామ : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే కోడ్‌ అమలులోకి వచ్చిందని, జిల్లాలో పకడ్బందీగా కోడ్‌ను అమలు చేస్తామని జనగామ కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌‌ సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు. కోడ్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

అనంతరం మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా కమిటీలతో ఎన్నికల నిబంధనలపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఉప ఎన్నికల అధికారిణి సుహాసిని, ఎంసీఎంసీ కమిటీ మెంబర్స్, పి.రాజేంద్రప్రసాద్, కన్న పరశురాములు, మణికుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవీందర్, ఈడీఎం దుర్గారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పోస్టర్ల తొలగింపు..
ఎన్నిక కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ పార్టీల ఫెక్సీలు, సైన్‌ బోర్డులు, పోస్టర్లును మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు ప్రభుత్వ పథకాల పోస్టర్లను ఆయా సిబ్బంది తొలగించారు.