అభయహస్తం- ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

అభయహస్తం- ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట జిల్లా లో  గత మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న అభయహస్తం- ప్రజాపాలన కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం  అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణ పరిధిలోని ఐదవ వార్డు దురాజ్ పల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని సిబ్బందికి సూచనలు చేశారు.  సూర్యాపేట మున్సిపాలిటిలోని  ప్రతి వార్డులో టెంట్లు, మంచినీటి సౌకర్యం, కౌంటర్లను, సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ కమీషనర్ కు అభినందనలు తెలిపారు. ప్రజలు తొందరపడి గుంపులుగా రావద్దని, జనవరి ఆరవ తేదివరకు గ్రామాలలో, వార్డులలో దరఖాస్తు లు స్వీకరిస్తారని, తరువాత కూడ ప్రభుత్వ కార్యాలయాల వద్ద దరఖాస్తు లు అందజేయవచ్చని అన్నారు. ప్రతి చోట కూడ తొక్కిసలాట లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.   మెప్మా ఆర్పిలు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుండి దరఖాస్తులు ఇవ్వడంతో పాటు, దరఖాస్తులు స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. దరఖాస్తులు స్వీకరించే సమయంలో గ్యాస్ కార్డు, కరెంటు మీటర్ నంబర్ ను నమోదు చేయాలని సిబ్బందికి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రామాంజుల రెడ్డి,డిఇ సత్యారావు,  వార్డు కౌన్సిలర్ భాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పటాన్ సైదాఖాన్, మద్దెబోయిన తిరుమలేష్, కొర్లపల్లి వెంకన్న, నభిఖాన్, మొండికత్తి లింగయ్య, నగేష్, పల్స ఉపేందర్, జానయ్య, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.