Sir Arthur Cotton - కాటన్ సేవలు చిరస్మరణీయం...

Sir Arthur Cotton -  కాటన్ సేవలు చిరస్మరణీయం...
  • నేడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి - డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు

నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యంగ్లీయ దేసీయం కాటనుం తం భగీరథం

ముద్ర,సెంట్రల్ డెస్క్:- సర్ ఆర్ధర్ కాటన్ ఇండియాలో తన సేవలు పూర్తయిన అనంతరం తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోబోయే ముందు తాను నిర్మించిన ధవలేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట ఫలితాలను స్వయంగా తెలుసుకుందామని గుర్రంపై గోదావరి నదీ తీరాన వెళుతుండగా....  నది ఒడ్డున ఒక వేద పండిత బ్రాహ్మణుడు పై శ్లోకం చదువుతూ గోదావరి నదికి పూజ చేస్తూ కనిపించాడు . వెంటనే కాటన్ గుర్రం దిగి ఆ బ్రాహ్మణ పండితునితో ఆ శ్లోకం అర్థం ఏమిటని అడగగా ..

 "పవిత్ర గోదావరి జలాలతో అనుదినం స్నానపానాలు ఆచరించగల పుణ్యఫలాన్ని మాకు ప్రసాదించిన మహానుభావుడు భగీరథ సమానుడైన ఆంగ్లేయుల కాటన్ దొరను దేవుని రూపంలో స్మరిస్తున్నాను" అని చెప్పాడు.

సర్ ఆర్థర్ కాటన్ 1803 మే 15వ తేదీన ఇంగ్లాండ్ లోని కాంబర్నీర్ అభి అనే చోట జన్మించారు. ఆయన వారి తల్లిదండ్రులకు 10వ సంతానం. అతని ఆరుగురు సోదరులు కూడా మానవ సేవలో తరించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కాటన్ 15వ ఏట ఇండియాలో సైన్యంలో పనిచేయటానికి ప్రభుత్వ అనుమతిని పొంది ఏడిస్కోమ్ లోని మిలటరీ శిక్షణాలయంలో చేరారు.

ఈస్టిండియా కంపెనీలో ఫిరంగి దళం మరియు ఇంజనీరింగ్ సర్వీసులో పనిచేయడానికి కావలసిన శిక్షణ పొందారు. విద్యార్థిగా 18 నెలల శిక్షణ పూర్తి కాగానే పదహారేళ్ల ప్రాయంలోనే ఏ పరీక్షా రాయనవసరం లేకుండా రాయల్ ఇంజనీర్ కు ఎంపికయ్యారు. 1820 జనవరి 31న సెకండ్ లెఫ్ట్నెంట్ ఆర్డినెన్స్ సర్వీస్ లో చేరి బ్రిటిష్ దీవుల సర్వే మ్యాప్ లు తయారు చేయడానికి పూనుకున్నాడు.  తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశాడు.1821 మే నెలలో ఈస్ట్ ఇండియా కంపెనీలో మిలిటరీ ఇంజనీర్ గా పనిచేయడానికి కాటన్ నియమితులయ్యారు. ఈస్టిండియా కంపెనీలో పనిచేయడానికి మొదట మద్రాస్ వచ్చిన తర్వాత పబ్లిక్ వర్క్స్ చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో లెఫ్ట్నెంట్ గా చేరారు.

  • 1834లో మొదట కావేరి డెల్టాలో ఎగువ ఆనకట్ట, 1836లో దిగువ ఆనకట్టను నిర్మించారు.
  • 1837లో మద్రాస్ నౌకాశ్రయం నిర్మాణ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
  • 1941 అక్టోబర్ 29న కాటన్ ఎలిజిబెత్ ను వివాహం చేసుకున్నాడు.

1932-33 సంవత్సరంలో గోదావరి ప్రాంతంలో అతివృష్టి , క్షామంతో ప్రతి నలుగురిలో ఒకరు మరణించారు. ఆస్తులను తెగ నమ్ముకొని వలసలు వెళ్లారు. ఆడపిల్లలను నైజాం బేరగాళ్లకు అమ్ముకున్నారు. దోపిడీ, దొంగతనాలతో ఈ ప్రాంతమంతా ఉంది. పెద్దాపురం , పిఠాపురం, కిర్లంపూడి, కపిలేశ్వరపురం, పోలవరం , కొత్తపల్లి, మొగల్తూరు మొదలగు సంస్థానాధిశులు నీటి పారుదల కట్టడాలను అశ్రద్ధ చేసి ప్రజాసంక్షేమాన్ని విస్మరించారు. ప్రజలను పీడించి పన్నుల  వసూలు మాత్రం మానలేదు.

గోదావరి డెల్టాకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి గల అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వమని మద్రాస్ ప్రభుత్వం 1844 ఆగస్టు 5వ తేదీన ఆర్ధర్ కాటన్ ను ఆదేశించింది.  సర్వే చేసేందుకు ఆరుగురు సర్వేయర్లను ఎనిమిది మంది సోల్జర్స్ ను కేటాయించారు. కాటన్ ప్రతిరోజు 10 మైళ్ళ వరకు గుర్రంపై తిరుగుతూ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు.  

సర్వేర్లకు అనుభవం లేకపోతే తనే స్వయంగా లెవెల్స్ కూడా తీసుకునేవాడు. వివిధ మార్గాల ద్వారా సర్వే కార్యక్రమాన్ని పూర్తిచేసిన కాటన్ 1845 ఏప్రిల్ 17వ తేదీన వివరణాత్మక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. గోదావరి, కృష్ణానది లోయల్లో సుమారు 20 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం లభిస్తుందని చెప్పారు. డెల్టా అంతటికి నౌకాయన సౌకర్యం కలుగుతుందని వివరించారు.

1846 ఏప్రిల్ 9వ తేదీన ప్రభుత్వ అంగీకారంతో లండన్ లోని డైరెక్టర్ల బోర్డుకి ఈ నివేదిక పంపగా, ఆనకట్ట నిర్మాణానికి 4,75,572 రూపాయలు పంట కాలువలు మరమ్మతులకు 14 వేల రూపాయలు ఖర్చు పెట్టేందుకు ఆమోదం తెలిపారు. 1847 జనవరిలో ఆనకట్ట నిర్మాణానికి మద్రాస్ ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఇవే కాకుండా తుంగభద్ర నదిపై కర్నూలు వద్ద సుంకేసుల నా ఆనకట్ట నిర్మాణము కర్నూలు కడప కాలువ నిర్మాణానికి కూడా కాటన్ మూల కారకుడు. బకింగ్ హామ్ కెనాల్ నిర్మాణం ద్వారా జల రవాణా మార్గాన్ని కాటన్ నిర్మించారు.ఈ రకంగా సేవలు అందించిన ఆ మహనీయుడుని దేవునితో పోల్చడం సమంజసనీయ మని పై శ్లోకం రూపంలో గోదావరి ప్రాంత ప్రజలు నిత్యం కృతజ్ఞతా భావం తెలియజేసుకుంటున్నారు.ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించుకుంటున్నాను.ధవలేశ్వరం వద్ద కాటన్ మ్యూజియంలో సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహానికి ఈ రోజు పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి