బీజేపీ వైపు అరవింద్ రెడ్డి చూపు ?

బీజేపీ వైపు అరవింద్ రెడ్డి చూపు ?

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, బీఆరెస్ నాయకుడు గడ్డం అరవింద్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీఆరెస్ లో ఉన్న అరవింద్ రెడ్డి బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ వెంట పని చేసిన అరవింద్ రెడ్డి 2009 లో జరిగిన ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి టీఆరెస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసి టీఆరెస్ ను వీడారు. కాంగ్రెస్ లో చేరడంతో అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు టీఆరెస్ లో చేరారు.

2014 ఎన్నికల్లో అంచనాలు తారుమారు అయ్యి టీఆరెస్ అధికారంలోకి రావడం అరవింద్ రెడ్డి ఓడిపోవడం దివాకర్ రావు గెలుపొందడం జరిగింది. 2018 ఎన్నికల వరకు కాంగ్రెస్ లో ఉన్న అరవింద్ రెడ్డి నస్పూర్ లో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆరెస్ లో చేరారు. సముచిత స్థానం ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆతర్వాత ఏ పదవి ఇవ్వలేదు. ధీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సంకల్పించారు. ఈమేరకు బీజేపీ పెద్దలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ లో చేరాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల చివరి వారంలో అనుచరులు, సన్నిహితులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆయనతో పాటు మంచిర్యాల పురపాలక సంఘంలో ఓ ప్రజాప్రతినిధి కూడా పార్టీ మారనున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా అరవింద్ రెడ్డి సోదరుడు అచ్యుతమ్ రెడ్డి కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.