నయా రజాకార్ల ఓటమే  లక్ష్యంగా యాత్ర

నయా రజాకార్ల ఓటమే  లక్ష్యంగా యాత్ర
  • పేదల రక్తం పిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు
  • పి వి కి సముచిత గౌరవం బిజెపి హయాంలో
  • బాబర్, రజాకార్ ఓట్లే కాంగ్రెస్ కు గతి
  • అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నయా రజాకార్ల ఓటమి లక్ష్యంగా బిజెపి విజయ సంకల్పయాత్ర చేపట్టిందని, నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా చూడడమే ఈ యాత్ర లక్ష్యం అని అసోం ముఖ్యమంత్రి హేమంత విశ్వశర్మ అన్నారు. కొమురం భీం విజయసంకల్ప బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా బాసరలో మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం భైంసాలో జరిగిన సభలో ఆయన కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల రక్తం పీల్చటమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని అన్నారు. బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వాలు పెట్రోలు రూ.100 లోపే అందజేస్తుండగా తెలంగాణ వంటి పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ పై సుంకాన్ని తగ్గించకుండా పేదల రక్తాన్ని పీలుస్తున్నాయని విమర్శించారు. సాక్షాత్తు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా దేశాన్ని ప్రగతి వైపు తీసుకెళ్లిన మాజీ ప్రధాని పివి నరసింహారావును కాంగ్రెస్ అవమానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారతీయ జనతా పార్టీ ఆయనకు భారతరత్న ప్రదానం చేసి కృతజ్ఞత చాటుకుందని స్పష్టం చేశారు.

పార్లమెంటు సమావేశాల్లో దేశ ఆర్థిక మంత్రిని తెలుగులో మాట్లాడమని ప్రధాని మోడీ సూచించడం తెలుగు ప్రజలపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనమని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీం నేతృత్వంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఘన చరిత్ర ఉందని అన్నారు.  ఇదే స్ఫూర్తితో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నయా రజాకార్లను ఇంటికి పంపాలని హర్షధ్వానాల మధ్య పిలుపు ఇచ్చారు. ఇప్పటికే మోదీ హయాంలో దేశం ఆర్థికంగా బలోపేతం అయిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరో సారి పట్టం కట్టి ఆర్థికంగా బలోపేతమయిన బ్రిటన్, చైనా వంటి దేశాల సరసన మన దేశాన్ని నిలపాల్సిన అవసరం ఉందని అన్నారు. రాహుల్ గాంధీ తొలిసారి జరిపిన భారత్ జోడో యాత్రతో మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వం పడిపోయిందని, ఈసారి రెండో భారత్ జోడో యాత్రతో దేశం నుండి కాంగ్రెస్ ను బయటకు పంపాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఆరు హామీలతో పదవిలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ ముందుకు సాగలేదని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికీ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బాబర్, రజాకార్ ఓట్లే గతి అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5500 కిలోమీటర్ల మేర కొనసాగనుందన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 కు పైగా సభలు జరుగుతాయన్నారు. ఈ సభలో బిజెపి రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాయల్ శంకర్, హరీష్ బాబు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎంఎల్ ఏ రాకేష్ రెడ్డి, నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, మాజీ జెడ్పీ చైర్మన్ సుహాసిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.