ఫోన్ లో ఫోటో తీయలేదని దాడి

ఫోన్ లో ఫోటో తీయలేదని దాడి
  • మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దోర్నాల గణేష్

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- శుభకార్యానికి వెళ్లి కెమెరాలో ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ ను హాజరైన బంధువులు ఫోన్లో ఫోటో తీయలేదని దాడి చేయడం దారుణమని మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దోర్నాల గణేష్ అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్చి లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో ఓ శుభకార్యానికి పులమోని లింగస్వామి అనే ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసేందుకు వెళ్ళాడు.

ఈ క్రమంలో శుభకార్యానికి హాజరైన బంధువులు ఫోన్లో ఫోటో తీయమని ఫోటోగ్రాఫర్ ని కోరారు. అయితే ప్రోగ్రాం హడావుడిలో ఉండి అతను ఫోటో తీయకపోవడంతో సహనం కోల్పోయిన బంధువులు ఫోటోగ్రాఫర్ పై నిష్పక్షపాతంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న ఫోటోగ్రాఫర్లపై ఇటువంటి దాడులు జరగకుండా అరికట్టాలని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు భోగ చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి మక్తాల కృష్ణ, ఉపాధ్యక్షులు సీత శ్రవణ్, కేమ విష్ణు, కార్యవర్గ సభ్యులు రాయబండి వెంకటాచారి, గోదాసు శేఖర్, దొడ్డమోని వంశీధర్, చెక్క మల్లేష్, దోర్నాల నందు, కృష్ణానందం, పెండెం బాల లింగం, దోర్నాల రత్నం, గంజి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.