సైబర్ నేరాలపై డైట్ లో అవగాహన

సైబర్ నేరాలపై డైట్ లో అవగాహన


ముద్ర ప్రతినిధి, మెదక్:ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎఎస్పీ మహేందర్ సూచించారు. బుధవారం  సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ సుభాష్ చంద్రబోస్, సి.ఐ. ఎన్. సురేష్ కుమార్  ఆధ్వర్యంలో మెదక్ డైట్ కళాశాలలో సైబర్  జాగరూకత దివాస్  సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.  ముఖ్య అతిధిగా హాజరైన ఎస్పీ ఎస్.మహేందర్  మాట్లాడుతూ....అసలు సైబర్ నేరాలు అనగా ఏమిటి?, సైబర్ నేరాల రకాలు, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు.   ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్ళు ఎన్నో రకాలుగా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని, సైబర్ నేరాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తమ బంధువులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరో తెలియని నేరస్థుడు సాంకేతికతను, ప్రజల అమాయకత్వాన్ని ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్ల రూపంలో దోచుకుంటున్నారని అన్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల మనమంతా అవగాహన కలిగి ఉంటే వాటి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించవచ్చని అన్నారు. అలాగే ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి యుండి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేగాక సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఫిర్యాదు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో  మెదక్ రూరల్ సి.ఐ రాజశేఖర్ రెడ్డి, డైట్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.రమేశ్ బాబు, సెక్టోరల్ ఆఫీసర్ ఏ.సతీష్ కుమార్, కళాశాల విద్యార్ధిని విద్యార్దులు  పాల్గొన్నారు.