మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పై బీసీల కన్ను

మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పై బీసీల కన్ను
  • బీసీలకు టికెట్ ఇవ్వాలని ప్రధాన పార్టీలపై ఒత్తిడి
  • రోజురోజుకు పెరుగుతున్న ఆశావహుల జాబితా

ముద్ర,ప్రతినిధి, మంచిర్యాల : రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టం పరీక్షించుకోవాలని బీసీ సామాజిక నేతలు ఉబలాటపడుతున్నారు. బీసీలు ఐక్యతా రాగం ఆలపిస్తుండడంతో ఆశావహుల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, బెల్లంపల్లి ఎస్సీలకు రిజర్వు చేశారు. మంచిర్యాల నియోజకవర్గం జనరల్ కేటగిరికి కేటాయించారు. ఈనియోజకవర్గంలో బీసీల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నప్పటికీ వెలమ సామాజిక వర్గం వారే గెలుస్తూ వస్తున్నారు. 1978లో జనతా పార్టీ నుంచి బీసీ అయిన చుంచు లక్ష్మయ్య మాత్రమే ఎన్నికల్లో గెలుపొందారు. 2009, 2010 ఉప ఎన్నికలో గడ్డం అరవింద్ రెడ్డి గెలిచారు. ఆ ఇద్దరు మినహా మిగతా ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గం గెలుస్తూ వారి కంచుకోటగా మలుచుకున్నారు. దీంతో ప్రధాన పార్టీలు ఆ వర్గం వారికి టికెట్ ఇస్తే గెలుస్తారనే విశ్వసిస్తు టికెట్లు ఇస్తున్నారనే వాదన ఉంది. అయితే ఈసారి ఎలాగైనా బీసీలకు అధికారం దక్కాలనే పట్టుదల బీసీల్లో పెరిగింది. 

  • అన్ని పార్టీల్లో బీసీ నినాదం

వచ్చే ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇవ్వాలని అధిష్టానం పై ఒత్తిడి తేవాలని బీసీ సంఘాలు సంకల్పించాయి. బీసీ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయి. ఇటీవల పలు మార్లు బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాయి. బీసీలు పట్టుదలతో, ఐక్యమత్యంతో ఉండాలని ఐక్యతా గానం ఆలపిస్తున్నారు. అవసరమైతే అధిష్టానం వద్ద ధిక్కార స్వరం వినిపించాలని తీర్మానించారు. 

  • ఆశావహులు వీరే

ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న బీసీ నేతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రధానంగా బీఆరెస్ లో ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. బీఆరెస్ కు చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్, మహిళా కోటా నుంచి మాజీ జడ్పిటీసీ రాచకొండ ఆశాలత, మావోయిస్టు మాజీ నేత, గుడిపేటకు చెందిన దొమ్మటి అర్జున్ ఉన్నారు. బీజేపీ నుంచి రఘునందన్ టికెట్ ఆశిస్తున్నా రు. కాంగ్రెస్ నుంచి డాక్టర్ నీలకంటేశ్వర్ రావు టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ ఇస్తే బరిలో నిలిచి విజయం సాధిస్తానని ప్రముఖ వైద్యుడు పూజారి రమణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంగళవారం ప్రైవేటు విద్యా సంస్థల సంఘం అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు తాను పోటీలో ఉన్నానని ప్రకటించారు. ప్రధాన పార్టీ లు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రునిగా బరిలో ఉంటానని మీడియాతో చెప్పారు. ఆయా పార్టీలు బీసీ వాదంకు మద్దతు ఇస్తాయా లేక వెలమ సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తాయా? వేచి చూడాలి. ఒకవేళ బీసీ అభ్యర్థి స్వతంత్రంగా పోటీ చేస్తే బీసీ సెంటిమెంట్ తో బీసీ ఓటర్లు అండగా నిలిచి ఓట్ల వర్షం కురిపించి అధికారపీఠంలో కూర్చోపెడుతారా ? లేక ఎప్పటి మాదిరిగానే మరో సామాజిక వర్గంకు పట్టం కడతారా అనేది ఆసక్తికరంగా మారింది.