సకలజనుల సంక్షేమమే ధ్యేయంగా బిజెపి ఎన్నికల మేనిఫెస్టో....

- అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలు పెడుతున్న బిఆర్ఎస్
- కాంగ్రెస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలు
- బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భోగ శ్రావణి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సకలజనుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బిజెపి ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని జగిత్యాల బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బోగ శ్రావణి అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ పార్టీ గత రెండు పర్యాయాలుగా అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల చెవిలో పూలు పెట్టిందని విమర్శించారు. బి ఆర్ ఎస్ దళితుడిని సీఎం చేస్తానని, నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ హామీలు నెరవేర్చకుండా ప్రజల చెవిలో పూలు పెట్టిందన్నారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారని వారి ఆకాంక్షలు నెరవేర్చడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు అండగా ఉంటామని ప్రకటిస్తూనే వరి ధాన్యంలో కోత విధించి రైతుల చెవిలో పూలు పెట్టిందన్నారు. డబుల్ బెడ్ రూమ్ హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చకుండా నిరుపేదల మోసం చేసిందన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తూ ఒకే వర్గానికి లబ్ధి చేకూరేలా మేనిఫెస్టోను రూపొందించి మెజార్టీ ప్రజల ఆకాంక్షలను గాలికి వదిలేసిందన్నారు. బి జే పీ కుల,మత, వర్గ బేధాలు లేకుండా సకల జనుల సౌభాగ్యం, అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు.
బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో వివిధ కారణాల చేత 13 లక్షల రేషన్ కార్డులను తొలగించారని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బిజెపి పని చేస్తుందని వరికి రూ.3100 మద్దతు ధరతో పాటు ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తామన్నారు. ఫసల్ బీమా యోజన అమలు చేసి పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు. పసుపు రైతులను ఆదుకోవడం కోసం పసుపు బోర్డు తో పాటు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన రైతులకు దేశీ ఆవులను పంపిణీ చేస్తామని, మహిళా రైతుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లను పంపిణీ చేస్తామని, మహిళా సంరక్షణ కోసం 21 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రూ.2 లక్షలు అందజేస్తామన్నారు. పొదుపు సంఘాలకు ఒక శాతం వడ్డీతో రుణాలు అందజేస్తామని తెలిపారు.
నిరుపేద మహిళలకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లను అందిస్తామన్నారు. నిరుద్యోగ యువత కోసం యుపిఎస్సి తరహాలో టిఎస్పిఎస్సి ద్వారా ఆరు నెలలకోసారి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే విధంగా జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తామన్నారు. నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తామని, బడ్జెట్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఫీజుల నియంత్రణకు కమిటీ వేస్తామన్నారు. నిరుపేదల వైద్యం కోసం రూపాయలు 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమాను కల్పిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు పెంచుతామని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. వయోవృద్ధులకు ఉచితంగా పవిత్ర పుణ్యక్షేత్రాలైన కాశి, అయోధ్యకు దర్శన సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించేందుకు కమిటీని ఏర్పాటు చేసి అవినీతి సొమ్మును ప్రభుత్వ స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపడతామన్నారు. ధరణి తో ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలను తొలగించేందుకు మాభూమి పేరుతో కొత్త వెబ్సైట్ను ప్రారంభిస్తామని తెలిపారు. ఉద్యోగస్తులకు 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి ని ఏర్పాటు చేసి ఒకటవ తేదీలోగా జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపడతామన్నారు. గల్ఫ్ సోదరుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణ కోసం వ్యాట్ ను తగ్గిస్తామని తెలిపారు. పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం వేస్ట్ మేనేజ్మెంట్ లో వారిని సహా యజమానులుగా గుర్తిస్తామని తెలిపారు. బీడీ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడి స్వయం సమృద్ధి సాధించేలా బిజెపి మేనిఫెస్టో రూపొందిస్తే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉచిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.ఇప్పటివరకు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని ఈసారి బలహీనవర్గాలకు చెందిన ఆడబిడ్డనైన తనను ఒక మారు ఎమ్మెల్యేగా గెలిపించి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని శ్రావణి కోరారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల్ అసెంబ్లీ కన్వీనర్ మదన్మోహన్ జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు ఉపాధ్యక్షులు మాడిశెట్టి మల్లేశం నాయకులు ఎల్ .శేఖర్, చింత అనిల్, బొమ్మకంటి ప్రమోద్, ప్రేమ్ సాగర్, ఎర్ర శీను, మల్లారెడ్డి, చెట్పల్లి గణేష్ సునీల్ మరియు తదితరులు ఉన్నారు