రాష్ట్రానికి కాషాయ దళం

రాష్ట్రానికి కాషాయ దళం
BJP National leaders focus on Telangana
  • తెలంగాణ బాట పట్టిన జాతీయ నేతలు
  •  వచ్చే ఎన్నికలే టార్గెట్​ గా టూర్లు
  • ఈ నెలాఖరు వరకూ మంత్రుల పర్యటనలు
  • వచ్చే నెలలో రానున్న ప్రధాని మోడీ
  • పరేడ్​ గ్రౌండ్​ లో భారీ బహిరంగ సభ
  • పాలమూరులో రేపటి నుంచి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

 ముద్ర, తెలంగాణ బ్యూరో : కాషాయ దళం తెలంగాణ బాట పట్టింది. జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రుల టూర్లు ఖరారయ్యాయి. ఈ నెలాఖరు వరకు విడతలవారీగా కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తుండగా, వచ్చేనెలలో ప్రధాని మోడీ రానున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను దక్షిణ తెలంగాణలో నిర్వహించనున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఈ నెల 23, 24న  జరిగే ఈ సమావేశాలకు సునీల్​ బన్సల్​, తరుణ్​ చుగ్​ హాజరవుతున్నారు.

 

బీజేపీ ముందస్తు హడావుడి

రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. మార్చి తర్వాత ముందస్తు ఉంటుందనే ప్రచారం జరుగుతున్నది. ఈ యేడాది మొత్తం ఎన్నికల కాలం కావడంతో తెలంగాణపై ప్రత్యేక ఫోకస్​ పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి జాతీయ నాయకత్వం క్యూ కడుతోంది. ఈ యేడాదే తొమ్మిది  రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల షెడ్యూల్​ కూడా విడుదలైంది. ప్రత్యేకంగా తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ తహతహలాడుతోంది. రాష్ట్రంలో బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీ ఎన్నికల హడావుడి మొదలు కావడంతో రాజకీయ వ్యూహాలకు కూడా పదును పెడుతోంది.

 

వరుసగా రాక

బీజేపీ కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రానికి రావడం మొదలుపెట్టారు. శనివారం కేంద్రమంత్రి బీఎల్​ వర్మ వరంగల్​, మహబూబాబాద్​ పార్లమెంట్​ సెగ్మెంట్లలో పర్యటించారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మెదక్​ పార్లమెంట్​ పరిధిలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల పర్యటన ఖరారైంది. 23, 24 తేదీలలో చేవెళ్ల పార్లమెంట్​ పరిధిలో కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషి పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడమే లక్ష్యంగా వీరి పర్యటన సాగనుంది. అయితే, 28న జరగాల్సిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన మాత్రం రద్దయ్యింది.

 

వచ్చేనెలలో 9 వేల కార్నర్​ మీటింగులు

బీజేపీ నేతలు రాష్ట్రంలో ప్రతి పల్లెకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తున్నది. దీనిలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నారు. వచ్చే నెల 5  నుంచి 9 వేల కార్నర్ మీటింగు​లను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జరిగే బైక్ ర్యాలీలు, పార్లమెంటరీ ప్రవాసీ యోజన, బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతంపైనా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే  అనుసరించాల్సిన వ్యూహం, కేసీఆర్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను జనంలో ఎండగట్టడం, కేంద్ర ప్రభుత్వ  స్కీమ్​లను ఇంటింటికి తీసుకెళ్లడం వంటి అంశాలపైనా చర్చించనున్నారు.

 

మరోసారి భారీ బహిరంగ సభ

వచ్చేనెల 13న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానున్నారు. ముందుగా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ ఇప్పటి నుంచే గ్రౌండ్​ వర్క్​ సిద్ధం చేస్తోంది. ​