బీజేపీ అధికారంలోకి వస్తే....

బీజేపీ అధికారంలోకి వస్తే....
BJP State President MP Bandi Sanjay Kumar comments
  • తండాల అభివ్రుద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తాం
  • బంజారాహిల్స్ సేవాలాల్ మందిరం నిర్మిస్తాం
  • ప్రముఖుల జయంతి, వర్దంతిలను పట్టించుకోని కేసీఆర్
  • కొండగట్టు బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
  • పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

ముద్ర తెలంగాణ బ్యూరో: బీజేపీ అధికారంలోకి వస్తే తండాల సమగ్రాభివ్రుద్ధి కోసం ప్రత్యేకంగా డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీనిచ్చారు. సేవాలాల్ నడయాడిన బంజారా హిల్స్ లో సేవాలాల్ మందిరాన్ని నిర్మించి ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సన్ నాయక్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, విలక్షణమైన దుస్తులు, ఆభరణాలతో ప్రత్యేకతను చాటుకునే బంజారా జాతికి సేవాలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడన్నారు. అటు బ్రిటీష్ పాలకులు, ఇటు ముస్లిం పాలకుల మత ప్రచారంతో అనేక ఇబ్బందులు పడ్డ బంజారా సమాజాన్ని తన ధర్మ ప్రచార బోధనలతో సన్మార్గంలో నడిపించిన మహానుభావుడు సేవాలాల్ అని కొనియాడారు.

నరేంద్రమోదీ ప్రభుత్వ 8 మంది గిరిజనులకు కేబినెట్ లో స్థానం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేశారన్నారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ గిరిజనులను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.  సేవాలాల్ మహారాజ్ సహా అంబేద్కర్, పూలె, జగ్జీవన్ రాం వంటి ప్రముఖుల జయంతి, వర్దంతిలకు ఏనాడు కూడా కేసీఆర్​ హాజరుకాలేదని ఆరోపించారు. తండాల్లో మిషన్ భగీరథ నీళ్ల ఊసే కన్పించడం లేదు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ నయా పైసా నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని మాట ఇచ్చి తప్పిన మోసగాడు కేసీఆర్ అంటూ సంజయ్​ మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఇచ్చి ఏళ్ల తరబడి అమలు చేయకుండా జాప్యం చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అని ఆయన దుయ్యబట్టారు.