ఇప్పుడు వారంతా ఎక్కడున్నారు?

ఇప్పుడు వారంతా ఎక్కడున్నారు?

కేసీఆర్ పై మండిపడిన బీజేపీ నేత ఈటల రాజేందర్

ముద్ర, తెలంగాణ బ్యూరో: సీఎం తీరు ‘తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే’ తీరుగా ఉందని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ మండిపడ్డారు. మోసానికి మారు పేరు కేసీఆర్ అని దుయ్యబట్టారు. ‘ తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్​ యూ నుంచి ఆర్ఎస్ఎస్​ వరకు అందరినీ రమ్మన్నారు. జేఏసీ పెట్టారు. మరి ఇపుడు కోదండరామ్, మంద కృష్ణ, విమలక్క ఎక్కడ ఉన్నారు?’ అని ఈటల ప్రశ్నించారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఎన్ని దుర్మార్గాలు చేసినా, అవమానాలు చేసినా అపుడు దిగమింగి ఊరుకున్నామన్నారు.

2018లో ఏసీబీ, ఈడీ, ఐటీ అధాకారులకు తన మీద ఒక దళితుడితో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. తనను ఓడించడానికి కౌశిక్ రెడ్డికి డబ్బులు పంపించారన్నారు. ‘మీరు టికెట్ ఇచ్చిన వారందరూ గెలిచారా ?  మీ వెంటే ఉన్నారా ? నేను ఎన్నడూ ఓడిపోలేదు. మీ గౌరవం పెంచలేదా? మీ పార్టీని బలోపేతం చేయలేదా ? అని ప్రశ్నించారు. కొడుకులాంటి వాడి మీద కుట్రలు చేస్తున్నారని, తన ఉసురు పోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలలో లాంగ్ జంప్ 3.8 మీటర్లు తగ్గించాలని ఆడపిల్లలు ఏడుస్తున్నారు. వారి బాధ పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టింది ప్రాక్టికల్ బడ్జెట్ అని కొనియాడారు. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ యువతకు ఉపాధి, దేశానికి పురోగతి, రైల్వేకి పెద్దపీట వేశారని ధన్యవాదాలు తెలిపారు.  మీడియా సమావేశంలో  మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి.. విక్రమ్ రెడ్డి, నెహ్రూ నాయక్, మేడి రమణ తదితరులు పాల్గొన్నారు.