గర్జించిన బండి

గర్జించిన బండి
  • తాగుబోతు చేతిలో తెలంగాణ
  • కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి
  • టెన్త్ లీక్ సిట్టింగ్ జడ్జితో విచారించాలి
  • కవిత, కేటీఆర్ జైలుకే
  • వరంగల్ లో నిరుద్యోగ మార్చ్
  • జైలు నుండి విడుదలైన అనంతరం బిజెపి స్టేట్ చీఫ్ బండి

ముద్ర ప్రతినిధి కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. విడుదల సమయంలో జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. రోడ్లకు అడ్డంగా భారీకేట్స్ పెట్టి పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సంజయ్ విడుదలైన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, పోలీస్ అధికారులపై నిప్పులు చెరిగారు. తాగుబోతు చేతిలో రాజ్యం నడుస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులే పేపర్ లీక్ కుట్ర దారులు అన్నారు. హిందీ పేపర్ లీక్ లో సంజయ్ కు ప్రమేయం ఉన్నట్లు వరంగల్ సిపి ప్రమాణం చేయాలన్నారు. లేకుంటే కెసిఆర్ చేతి మోచేతి నీళ్లు తాగినట్లే అని మండిపడ్డారు. సిపి రంగనాథ్ చరిత్ర మొత్తం బయటికి తీస్తామన్నారు. సిపి తీరుతో పోలీసులు తల దించుకునే పరిస్థితి ఏర్పడింది అన్నారు. పరీక్షల నిర్వహణ చేతగాక మాపై కుట్రలు పన్నుతున్నారు అని వెల్లడించారు. ప్రశ్న పత్రాల లీక్ తో మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. టెక్నాలజీలో మేము తోపు అని చెప్పుకునే కేటీఆర్ కేసును ఎందుకు చేదించడం లేదని ప్రశ్నించారు. 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన కేటీఆర్ ను మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

లిక్కర్ కేసులో  కవిత జైలుకు వెళ్లడం ఖాయం. ఆ తర్వాత కేటీఆర్ జైలుకు వెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులతో వరంగల్ లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. నాపై పిడి యాక్ట్ పెట్టాలన్న మంత్రి హరీష్ రావు పై మర్డర్ కేసు నమోదు చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1400 మంది యువకుల బలిదానాలకు కారకుడు హరీష్ రావు అని ఆరోపించారు. మా అత్తమ్మ కొడుకులా నన్ను చూసుకుందని ఆమె అంతిమ సంస్కారాలు చేయాల్సిన బాధ్యత నాపై ఉందని తెలిసినా పోలీసులు కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా తెలపలేదని అన్నారు. పోలీసులు అరెస్టు చేసే తీరు తీవ్ర అభ్యంతరకరం అన్నారు. కుటుంబ సభ్యులను నెట్టివేశారని, ఇంట్లో వస్తువులను చెల్లాచెదురు చేశారని దీంతోపాటు పోలీసులు తనపై వ్యవహరించిన తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. కేంద్రం సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తుందని అసత్య ప్రచారం చేస్తూ బిఆర్ఎస్ నాయకులు లబ్ధి పొందాలని చూడడం హాస్యాస్పదం అన్నారు. నేడు జరిగే మోడీ సభకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట బిజెపి లీగల్ సెల్, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావులు ఉన్నారు. అనంతరం కోర్టు చౌరస్తాలో బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున సంజయ్ కు స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా మహాశక్తి దేవాలయం కు వెళ్లి పూజలు నిర్వహించారు. తదుపరి వారి అత్తమ్మ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణలో లీకేజీ మాఫియా నడుస్తుంది :  తరుణ్ చుగ్

 జైలు నుండి విడుదలైన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు సంఘీభావం తెలపాలని అధిష్టానం ఆదేశించడంతో హైదరాబాదు నుండి నేరుగా బండి సంజయ్ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. సంజయ్ అత్తమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో లీకేజ్ మాఫియా నడుస్తుందని మండిపడ్డారు. ఈనెల 5 అర్ధరాత్రి సంజయ్  అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. కొందరు పోలీసులు కేసీఆర్ చేతిలో బంధీలయ్యారని ఆరోపించారు. బండి సంజయ్ ను అరెస్టు చేసి తరలించే క్రమంలో పోలీసులే సెల్ ఫోన్ దొంగిలించారని పేర్కొన్నారు. దానిని ఎలా రికవరీ చేసుకోవాలో తమకు తెలుసు అన్నారు. సంజయ్ విడుదల నాలుగు కోట్ల ప్రజల విజయమన్నారు. 30 లక్షల నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నాడని తెలిపారు. కెసిఆర్ అహంకారంతో పాలన చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడని విమర్శించారు. దానికి అధికారులు వంత పాడడం సరికాదన్నారు. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ వెనక కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని, రాష్ట్రంలో లీకేజీ, లిక్కర్, డ్రగ్స్, లూట్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని వెల్లడించారు.

ప్రతిష్టాత్మకమైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఎట్లా జరిగిందో తేల్చకుండా టెన్త్ పేపర్ లీకు అంటూ ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. లీకేజీ వెనుక ఎవరి హస్తం ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. కెసిఆర్ ది ఆలీబాబా 40 దొంగల రాజ్యం. రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం ఆగదన్నారు కెసిఆర్ కుటుంబం నిర్లక్ష్యం కారణంగా 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు. వరంగల్ సిపి మాలిక్ కాదు  సేవకుడివే అన్న విషయం గుర్తుంచుకో అని హెచ్చరించారు. ఎక్కడైతే బండి సంజయ్ ను అరెస్టు చేశారో అక్కడ నుండే నిరుద్యోగ మార్చ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. లీక్ లపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దానికి కారకులైన కేటీఆర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలన్నారు. ఒక్కో నిరుద్యోగికి లక్ష రూపాయల  భృతి చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్,  ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు జె.సంగప్ప, పోరెడ్డి కిశోర్ రెడ్డి,  కార్యదర్శులు జయశ్రీ, ఉమారాణి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.