బీఆరెస్, కాంగ్రెస్ మధ్య వరద పోరు

బీఆరెస్, కాంగ్రెస్ మధ్య వరద పోరు

కౌన్సిల్ సమావేశంలో చర్చకు చైర్మన్ నిరాకరణ
తప్పుపట్టిన కాంగ్రెస్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల పురపాలక సంఘం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల పోరు జరిగింది. సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఇటీవల మంచిర్యాల లో వరదలు వచ్చిన అంశంపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు కోరగ చైర్మన్ పెంట రాజయ్య నిరాకరించారు. అజెండాలోని అంశాలపై మాత్రమే మాట్లాడాలని నిబంధనలు పెట్టారు. కాంగ్రెస్ సభ్యులు వరదలు, జరిగిన నష్టంపై చర్చించాలని పట్టుపట్టగా సమావేశం ముగిసిందని చైర్మన్ సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. అనంతరం మీడియా ఎదుట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

కాంగ్రెస్ బురద రాజకీయం చేస్తోంది 
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బురద రాజకీయం చేస్తున్నారని చైర్మన్ పెంట రాజయ్య ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సహాయం చేయడానికి సహకరించాల్సిన విపక్షం విమర్శలు చేయడం తగదని సూచించారు. వరదలు వచ్చే ముందు ముంపు ప్రాంతవాసులను పునరావాస కేంద్రంకు తరలించామని చెప్పారు. వరదల అనంతరం అంటు వ్యాధులు ప్రబలకుండా చెత్త, చెదారం, బురద తొలగించామని గుర్తు చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం మంచిపరిణామాలు కావని అన్నారు. వరదలు రాకుండా ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారని వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ అన్నారు.

వరదలపై చర్చిద్దామంటే పారిపోయారు 

వరదల అంశంపై కౌన్సిల్ సమావేశంలో చర్చిద్దామంటే చైర్మన్ అర్ధంతరంగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రావులఉప్పలయ్య విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఎలా ఆదుకోవాలి, భవిష్యత్తు లో వరదలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చిద్దామంటే నిరాకరించడం దారుణమని  అన్నారు. ప్రజలకు సంబంధించిన విషయాల గురుంచి కౌన్సిల్ సమావేశంలో చర్చించవలసిందేనని అన్నారు. తనవార్డులో వరదలు రాకుండా రాళ్ల వాగు ఇరువైపులా కరకట్టకట్టి శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ కౌన్సిలర్ కొండా పద్మ చంద్రశేఖర్ కోరారు.

బీఆరెస్, కాంగ్రెస్ కౌన్సిలర్ ల ప్రెస్ మీట్