అభివృద్ధికి చిరునామా బీఆర్ఎస్..

అభివృద్ధికి చిరునామా బీఆర్ఎస్..
  • అసెంబ్లీలో అడుగు పెట్టేది ఎమ్మెల్యే గండ్రనే..
  • భూపాలపల్లిలో చేసిన అభివృద్ధి పనులే శ్రీరామ రక్ష..
  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి చిరునామాగా పేరుగాంచిందని, అసెంబ్లీలో అడుగు పెట్టేది ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాత్రమేనని, భూపాలపల్లిలో చేసిన అభివృద్ధి పనులే శ్రీరామ రక్షలా కాపాడుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే తన రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూ, అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఐదు సంవత్సరాల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి, ప్రజల కష్టాలు తీర్చిన వెంకటరమణా రెడ్డి మహనీయుడని కొనియాడారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పని పాట లేని కొందరు చోటమోటా నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి పై బురద చల్లుతున్నారని అది వారికి మంచిది కాదని హితవు పలికారు. 

అభివృద్ధిలో భూపాలపల్లికి సింహభాగం..

అభివృద్ధిలో జయశంకర్ భూపాలపల్లిది సింహభాగమని చైర్మన్ రమేష్ గౌడ్ అన్నారు.వేలాది కోట్ల రూపాయలతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, నియోజకవర్గంలోని భూపాలపల్లి, గణపురం, గోరికొత్తపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, శాయంపేట మండలాల్లో గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. ఇదంతా తెలిసినా కొంతమంది సోయి లేని వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా పనికట్టుకుని విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. అభివృద్ధి విషయంలో ఎన్ని విమర్శలు చేసినా వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గెలవబోతున్నాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

సభ జనాన్ని చూసి జడుసుకున్న ప్రతిపక్షాలు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఇటీవలె నిర్వహించిన బహిరంగసభను చూసి ప్రతిపక్ష పార్టీలు జడుసుకున్నాయని రమేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో భూపాలపల్లి నియోజకవర్గ రూపురేఖలు మార్చి ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలను తీసుకువచ్చి మంత్రి కేటీఆర్ చే ప్రారంభోత్సవాలు చేసిన ఘనత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిదే నని, అందుకే కేటీఆర్ సభకు లక్షలాదిమంది తరలి వచ్చారని, ఆ జనాన్ని చూసిన కాంగ్రెస్, బిజెపి పార్టీలకు వణుకు పుట్టిందన్నారు. నియోజకవర్గంలో ఏ కులానికి చెందిన వారైనా గానీ, పని కావాలి అంటే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయా కుల సంఘాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన చేస్తున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సేవల్ని వివిధ కుల సంఘాల బంధువులు మర్చిపోకుండా ఈసారి తప్పక కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.