హస్తం వైపు బీఆరెస్ నేతల చూపులు

హస్తం వైపు బీఆరెస్ నేతల చూపులు
  • రేవంత్ ను కలిసిన కౌన్సిలర్ భర్త 

రామకృష్ణాపూర్,ముద్ర : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు  సమీపిస్తుండడంతో అధికార పార్టీకి చెందిన లీడర్ల అడుగులు ఎటువైపు అనే ప్రశ్నలు సర్వత్ర వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో ఉంటూ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన నేతలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది కొత్తదారులను వెతుకుతున్నారు. ఇటీవల క్యాతన పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అధికార పార్టీ కౌన్సిలర్ల పై ఆగస్టు 5 వ తేదీన ముద్ర పత్రికలో పార్టీ మారతారా..? అనే శీర్షికన ప్రచురించిన కథనానికి స్పందన కనిపిస్తుంది.    

  • రేవంత్ ను కలిసిన కౌన్సిలర్ భర్త ..

2018 చెన్నూరు అసెంబ్లీ ఎన్నికల్లో యువ నాయకున్ని స్వాగతిస్తూ,పార్టీ కోసం,యువ నాయకుని గెలుపు కోసం యువ నాయకత్వాన్ని పటిష్టం చేసి అత్యంత చురుగ్గా పనిచేసిన బింగి శివ కిరణ్ 2019 లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో భార్య బింగి శివానికి 15 వ వార్డు కౌన్సిలర్ టికెట్ ను పార్టీ అధిష్టానం కేటాయించింది. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం వార్డు కౌన్సిలర్ గా బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు భార్యతో పాటు యువ నాయకునిగా పార్టీకి పనిచేసిన శివ కిరణ్ గత కొద్దీ రోజులుగా దూరంగా ఉంటూ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కాకుండా కేవలం తన పనులకే పరిమితం అయ్యారు.నిత్యం  పనులలో నిమగ్నమైన అతను ఇటీవల పార్టీ మారే ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం హస్తం వైపు అడుగులు వేసేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.అది నాయకుడు పట్టించుకోక పోవడం ఒక కారణం అయితే ఆత్మగౌరవం కోసం మాత్రమే తాను సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సోమవారం కలవడంతో అధికార పార్టీలో కొంత ఆలోచన మొదలైనట్లుగా తెలుస్తుంది. మందమర్రి విద్యార్థి విభాగం నాయకులు ముజాహిద్, రామకృష్ణాపూర్ కు చెందిన 15 వార్డు కౌన్సిలర్ భర్త బింగి శివ కిరణ్,ఇందాస్,మంజుల లు కలిసి ప్రస్తుత నియోజవర్గ రాజకీయ పరిస్థితులపై రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు.

  • కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..

రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకులు ముద్ర విలేకరితో చరవాణిలో మాట్లాడారు. చెన్నూరు నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అభ్యర్థి ఎవరైనా, పార్టీ టికెట్ కేటాయించిన వ్యక్తులతో కలిసి తాము పనిచేస్తామని రేవంత్ రెడ్డితో చెప్పినట్లుగా స్పష్టం చేశారు.తాము ఎవరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని,కేవలం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి పని చేస్తామని మాట ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. కొందరు తాము పార్టీలో చేరినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, అంతా మేమే చేసాం అనే ఓ ఎమ్మెల్యే అభ్యర్థితో తమకు ఎటువంటి సంబంధం లేదని సోషల్ మీడియా ఫేస్ బుక్,వాట్సప్ లలో శివ కిరణ్ పోస్ట్ చేశారు. తెరముందు మేమే అయితే మా వెనుక అనేక మంది అంటూ త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా రెండువేల మందితో కార్లతో ర్యాలీగా వెళ్లి రేవంత్ రెడ్డిని కలుస్తామని పేర్కొన్నారు.